సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు | - | Sakshi
Sakshi News home page

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు

Nov 6 2025 7:26 AM | Updated on Nov 6 2025 7:26 AM

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు

ముమ్మరంగా రికార్డుల తనిఖీ

మహారాణిపేట/మధురవాడ/పెదగంట్యాడ: రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న అవినీతి నిరోధక శాఖ దాడుల్లో భాగంగా.. నగరంలోని పలు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అధికారులు బుధవారం ఆకస్మిక సోదాలు నిర్వహించారు. మహారాణిపేట, మధురవాడ, పెదగంట్యాడ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఏకకాలంలో ఈ తనిఖీలు జరిగాయి. ఉదయం ప్రారంభమైన ఈ సోదాలు రాత్రి వరకు కొనసాగాయి.

రికార్డుల పరిశీలన : సూపర్‌బజార్‌ ఆవరణలోని జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో అధికారులు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు రికార్డులను ముమ్మరంగా తనిఖీ చేశారు. రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన పత్రాలు, రిజిస్ట్రేషన్లలో ఉల్లంఘనలు, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు, నాన్‌ జ్యూడిషియల్‌ స్టాంప్‌ పేపర్ల అమ్మకాల వివరాలను, రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించారు.

మధురవాడలో..

మధురవాడ సబ్‌ రిజిస్టార్‌ కార్యాలయంలో ఏసీబీ ఇన్‌స్పెక్టర్‌ మహేశ్వరరావు ఆధ్వర్యంలోని బృందం విస్తృత తనిఖీలు చేపట్టింది. ఇక్కడ సబ్‌ రిజిస్టర్‌ చక్రపాణి, ఇతర సిబ్బందిని వేర్వేరుగా విచారించారు. ఈ సందర్భంగా కార్యాలయంతో ఎటువంటి సంబంధం లేని నలుగురు అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. వారిని తదుపరి విచారణ కోసం విశాఖ కార్యాలయానికి తరలించారు. అయితే, అధికారులు ఈ వివరాలను గోప్యంగా ఉంచడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఏసీబీ సోదాల కారణంగా, రిజిస్ట్రేషన్ల కోసం ముందుగానే స్లాట్లు బుక్‌ చేసుకున్న వారితో సహా, వివిధ పనుల నిమిత్తం వచ్చిన కక్షిదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు పనులు కాకపోవడంతో నిరాశగా వెనుదిరిగారు.

డాక్యుమెంట్‌ రైటర్లు పరార్‌

పెదగంట్యాడ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ప్రవేశించిన ఏసీబీ అధికారులు, వెంటనే కార్యాలయంలో ఉన్న కక్షిదారులను బయటకు పంపించి, అన్ని డోర్లను మూసివేశారు. సిబ్బంది మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకుని, వారిని ఒక గదిలో ఉంచి తనిఖీలు చేశారు. సబ్‌ రిజిస్టార్‌ రోహన్‌ కుమార్‌ కంచరాన చాంబర్‌తో పాటు, టేబుళ్లు, డెస్క్‌లను తెరిచి రికార్డులను, కంప్యూటర్లలోని హార్డ్‌ డిస్క్‌లను పరిశీలించారు. ఏసీబీ అధికారులు కార్యాలయంలోకి అడుగుపెట్టగానే, కార్యాలయం వెలుపల ఉన్న డాక్యుమెంట్‌ రైటర్లు తమ కార్యాలయాల షటర్లను దించేసి, తాళాలు వేసి అక్కడి నుంచి పరారయ్యారు. మూడు కార్యాలయాల్లోనూ ఏకకాలంలో జరిగిన ఈ దాడులు తీవ్ర కలకలం రేపాయి. పూర్తి స్థాయి తనిఖీల అనంతరం వివరాలు వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement