● పుష్కరిణీ నమోస్తుతే..
సింహాచలం: కార్తీక పౌర్ణమి సాయంసంధ్య.. పవిత్ర వరాహ పుష్కరిణి.. వేలాది దీపాల కాంతులతో, భక్తజన సంద్రంతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. శుభ ఘడియలలో.. పవిత్ర జలరాశికి పుణ్యనదీ హారతి(గంగా హారతి) సమర్పించే అపురూప ఘట్టానికి బుధవారం సింహగిరి క్షేత్రం సాక్ష్యంగా నిలిచింది. ముందుగా శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానానికి చెందిన కొండదిగువ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం నుంచి వెంకన్న ఉత్సవమూర్తులను శేషతల్పంపై ఆశీనులను చేశారు. మంగళ వాయిద్యాల నడుమ తిరువీధిగా పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. అక్కడ సిద్ధం చేసిన దివ్య వేదికపై స్వామి కొలువుదీరగా, ఆ ప్రాంతం భక్తుల నామస్మరణతో మార్మోగింది. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం నిర్వహించారు. అనంతరం స్వామికి ద్వయ, నక్షత్ర, కుంభ హారతులను సమర్పించగా, ఆ కర్పూర కాంతుల్లో స్వామి దివ్య రూపం మరింత దేదీప్యమానంగా ప్రకాశించింది. అనంతరం స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, కరి సీతారామాచార్యులు, ఇతర అర్చక బృందం.. పుష్కరిణి గట్టుపై ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికల నుంచి పుష్కరిణీ నమోస్తుతే.. అంటూ వరాహ పుష్కరిణికి దివ్య నీరాజనం సమర్పించారు. ఆ హారతి వెలుగులు పవిత్ర జలంలో ప్రతిబింబిస్తుండగా, ఆ దృశ్యాన్ని కనులారా వీక్షించిన భక్తజనం భక్తి పారవశ్యంతో పులకించిపోయింది. అదే సమయంలో.. పుష్కరిణి గట్టున వందలాది మంది మహిళలు కార్తీక దీపాలు వెలిగించారు. కోలాటాలు, భరత నాట్య ప్రదర్శనలు, హరినామ సంకీర్తనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో దేవస్థానం ఇన్‌చార్జి ఈవో ఎన్.సుజాత, ఇతర అధికారులు పాల్గొన్నారు.
● పుష్కరిణీ నమోస్తుతే..


