జనగణనకు సిద్ధం కండి
రాష్ట్ర సెన్సస్ డైరెక్టర్ నివాస్
భీమునిపట్నం: జనగణన–2027కు సంబంధించిన ముందస్తు సన్నాహక కార్యక్రమాలు(ప్రీ టెస్ట్) ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా బుధవారం భీమిలిలో ఇళ్ల గణన కార్యక్రమంపై రాష్ట్ర జనగణన డైరెక్టర్ జె. నివాస్ అధ్యక్షతన శిక్షణ కార్యక్రమం జరిగింది. భీమిలి మండల ప్రజా పరిషత్ కార్యాలయం, జీవీఎంసీ జోనల్ కార్యాలయంలో జీవీఎంసీ అదనపు కమిషనర్ డి.వి.రమణమూర్తి ఆధ్వర్యంలో ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లకు ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ నివాస్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఇళ్ల గణన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 4 కేంద్రాల్లో ఈ ప్రీ–టెస్ట్ జరుగుతుండగా, అందులో విశాఖ జిల్లా ఒకటని పేర్కొన్నారు. భీమిలి జోన్ పరిధిలోని 2, 3 వార్డుల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు. ఈ నెల 4 నుంచి 6 వరకు మూడు రోజుల పాటు ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లకు శిక్షణ ఉంటుందన్నారు. మొదటి దశలో ఇళ్ల జాబితా తయారీ, ఇళ్లలో నివసించే వారి వివరాలు, గణన నిర్వహించాల్సిన విధానం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కార్యక్రమ ప్రాముఖ్యంపై ఈ శిక్షణలో వివరిస్తున్నట్లు చెప్పారు. ప్రజల సౌకర్యార్థం ఈ నెల 1 నుంచి 7 వరకు సెల్ఫ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అందుబాటులో ఉంటుందని, ప్రజలు స్వచ్ఛందంగా నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. ఈ నెల 10 నుంచి 30 వరకు ఎన్యూమరేటర్లు క్షేత్రస్థాయిలో ఇళ్ల గణన నిర్వహిస్తారని తెలిపారు. ఇంటికి వచ్చే సిబ్బందికి ప్రజలు పూర్తి సమాచారం అందించి, గణనకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సెన్సస్ డిప్యూటీ డైరెక్టర్ దయాసాగర్, భీమిలి జోనల్ కమిషనర్ అయ్యప్పనాయుడు పాల్గొన్నారు.


