సాక్షి, విశాఖపట్నం: మధురవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. రిజిస్ట్రేషన్‌లలో అవకతవకలకు పాల్పడినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. గతంలో మధురవాడ సబ్ రిజిస్ట్రార్‌పై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఏడాది కాలంగా ఆయన చేసిన రిజిస్ట్రేషన్లపై అధికారులు ఆరా తీస్తున్నారు. మధురవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బినామీలతో ఆర్థిక లావాదేవీలు జరిపినట్టు సమాచారం. కూటమి నేతల అండతో భారీగా అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ కీలక ఆధారాలు సేకరించింది. 296 జీవో పరిధిలో రిజిస్ట్రేషనున్ల, భారీ ల్యాండ్ డీల్స్ పెండింగులపై విచారణ చేపట్టింది. రాష్ట్రంలోనే అత్యధిక ఆదాయం వచ్చే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా మధురవాడ, సూపర్ బజార్, గంట్యాడ కాగా, మధురవాడ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో 296 జీవో కింద చేయాల్సిన 260 డాక్యుమెంట్లు, 60 ప్రైవేట్ డాక్యుమెంట్ల పరిశీలించారు. విశాఖలో 9 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా.. ఈ ఆర్థిక సంవత్సరంలో 7 నెలల్లో దాదాపు 600 కోట్లు విలువైన ఆదాయం వచ్చింది.
ఎన్టీఆర్ జిల్లా: ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రెండోరోజు ఏసీబీ సోదాలు చేపట్టింది. మొదటిరోజు అర్ధరాత్రి వరకు సోదాలు నిర్వహించగా.. తిరిగి నేటి ఉదయం ఇబ్రహీంపట్నం కార్యాలయానికి చేరుకున్న ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. డబుల్ రిజిస్ట్రేషన్లు, డాక్యుమెంట్ల ట్యాంపరింగ్, ప్రైవేట్ వ్యక్తుల పాత్రపై ఏసీబీ అధికారుల విచారణ చేపట్టారు. లెక్కల్లో చూపని నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.


