సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. ఏసీబీ సోదాల్లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డాక్యుమెంట్ రైటర్స్‌తో కుమ్మక్కై నెలవారీ మామూళ్లకు సబ్ రిజిస్ట్రార్లు తెరలేపారు. ఒంగోలులోని ఓ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నుంచి రూ.30వేల రూపాయల నోట్ల కట్టని సిబ్బంది బయటకి విసిరేశారు.
గతంలో ఏసీబీ అధికారులు వలలో చిక్కిన అధికారులపై ఏసీబీ బృందం స్పెషల్ ఫోకస్ పెట్టింది. 120కి పైగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయలపై దాడులు చేపట్టింది. విశాఖలోని మధురవాడ, గాజువాకలో కొన్ని కీలకమైన విషయాలను ఏసీబీ అధికారులు గుర్తించారు. ఏసీబీ అధికారులు దాడులతో పలు చోట్ల తమ కార్యాలయాలకు తాళాలు వేసి డాక్యుమెంట్ రైటర్లు పరారయ్యారు.
లెక్కల్లో చూపని మొత్తం రూ.10,000 నుంచి 75,000 వరకు నగదుని వివిధ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు గుర్తించారు. విశాఖపట్నంలో జగదాంబ సెంటర్, పెద్ద గంట్యాడ, మధురవాడ.. విజయనగరంలో భోగాపురం, ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం, పల్నాడులో నరసరావుపేట.. ప్రకాశంలో ఒంగోలు, చిత్తూరు రేణిగుంట, కడపలో రాజంపేట.. అనంతపురంలో చిలమత్తూరు, కర్నూలులో ఆళ్లగడ్డ.. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దాడులు నిర్వహించారు. రిజిస్ట్రేషన్‌లో ఉల్లంఘనలు, రిజిస్ట్రేషన్ కోసం పెండింగ్‌లో ఉంచిన పత్రాలను అధికారులు గుర్తించారు.


