కూటమి పాలనలో.. వినికిడి సమస్య!
విశాఖలో నిలిచిన
కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలు
వైఎస్సార్ సీపీ హయాంలో
ఉచితంగా సర్జరీలు
రూ.10 లక్షలు ఖర్చయ్యే సర్జరీని
నిలిపివేసిన సర్కార్
చికిత్స కోసం నిరీక్షణలో
9 మంది చిన్నారులు
శస్త్రచికిత్స కోసం నిరీక్షిస్తున్న చిన్నారులు
హేమవర్షిత్, టి.కన్నారావు
మహారాణిపేట: వినికిడి సమస్య ఉన్న రోగుల పాలిట గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో వరంగా మారిన కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సను కూటమి ప్రభుత్వం మూలకు చేర్చింది. నాలుగు మాసాలుగా ఈ పరికరాల సరఫరా లేకపోవడంతో ఈఎన్‌టీ ఆస్పత్రిలో శస్త్ర చికిత్సలు నిలిచిపోయాయి. మళ్లీ ఎప్పుడు ప్రారంభిస్తారో తెలియక బాధిత చిన్నారులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఆలస్యమయ్యే కొద్దీ కొందరు అర్హత కొల్పొయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గత ప్రభుత్వంలో ఘనం
ఉత్తరాంధ్ర జిల్లాలకు కేంద్రంగా ఉన్న చెవి, ముక్కు, గొంతు(ఈఎన్‌టీ) ప్రభుత్వ ఇక్కడ ఆస్పత్రికి ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాలతోపాటు చత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి కూడా రోగులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. 30–50 వరకు ఓపీ ఉంటుంది. ఇక్కడ డాక్టర్ హరికృష్ణ ఆధ్వర్యంలో గత ప్రభుత్వ హయాంలో అనేక శస్త్ర చికిత్సలు ఆరోగ్యశ్రీ పరిధిలో చేశారు. ఒక్కో రోగి కోసం రూ.10 లక్షలు ఖర్చయ్యే కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలూ నిర్వహించారు. బాధిత చిన్నారులు పైసా ఖర్చు లేకుండానే వినికిడి సామర్థ్యం పొందారు. ఇప్పుడిదంతా గతం.
నాలుగు నెలలుగా నిరీక్షణ
కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక అన్ని రకాల శస్త్ర చికిత్సలకు అంతరాయం కలుగుతోంది. నాలుగు నెలలుగా వినికిడి సమస్యతో బాధపడే చిన్నారులకు నిర్వహించే కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలు నిలిచిపోయాయి. ఈ పరికరాలు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రావడం, వాటిని అమర్చేందుకు వైద్యులు శస్త్ర చికిత్సలు నిర్వహించేవారు. ప్రస్తుతం ఆ పరికరాల కొనుగోలుకు అనుమతులు రాకపోవడంతో చికిత్సలు నిలిపేశారు. ప్రస్తుతం ఆస్పత్రిలో 9 మంది చిన్నారులు ఈ శస్త్ర చికిత్సల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు.
చిన్నతనంలోనే చికిత్స చేయాలి
పుట్టుకతోనే చెవిటి, మూగతో బాధపడుతున్న చిన్నారులకు ఆత్యాధునిక శస్త్ర చికిత్స విధానం ఇప్పుడు ఈఎన్‌టీ ఆస్పత్రిలో చేస్తున్నారు. ఈ కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చిన్నతనంలో చేయాలి. మూడేళ్ల లోపు చిన్నారులకు ఈ శస్త్ర చికిత్స చేస్తే మంచి ఫలితం ఉంటుంది. నాలుగేళ్లు దాటాక కొందరు, ఐదేళ్ల తర్వాత మరికొందరు గుర్తించగలుతున్నారు. చిన్నారులకు వివిధ రకాల పరీక్షలు చేసి, వారు శస్త్రచికిత్సకు అర్హులు అని నిర్ధారించేందుకు కనీసం ఆరు నెలల సమయం పడుతుంది. ఈలోగా వయస్సు ఐదేళ్లు దాటిపోతే ఒక్కోసారి ఈ చికిత్స విజయవంతం కాదని వైద్యులు చెప్తున్నారు. దీంతో చాలా మంది చిన్నారుల వయస్సు దాటి పోతోందని, దీనిపై ప్రభుత్వ పెద్దలు ఆలోచన చేసి త్వరగా అనుమతులు ఇవ్వాలని తల్లిదండ్రులు, వైద్యులు కోరుతున్నారు.
వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో పలు పథకాల పట్ల కూటమి ప్రభుత్వం సవతి ప్రేమ
చూపిస్తోంది. పేద ప్రజలకు సంపూర్ణ
ఆరోగ్యాన్నిచ్చే ఆరోగ్యశ్రీతో ఇన్నాళ్లూ ఆటాడుకుంది. అంతకు ముందు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే వైద్యులు సమ్మె బాట పడితే తప్ప, వారిని పట్టించుకోలేదు. ఇప్పుడు పుట్టుక నుంచే వినికిడి సమస్యతో బాధపడుతున్న చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపే కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలను నిలిపేసి.. తమకు ప్రజల ఆకాంక్షలేవీ కనబడవు.. వినబడవని నిరూపించుకుంటోంది.
కూటమి పాలనలో.. వినికిడి సమస్య!


