రైల్వే భవనాలను పునరుద్ధరించండి
కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు
మహారాణిపేట: బ్రిటిష్ కాలం నాటి రైల్వే భవనాలను అమృత్ భారత్ పథకం ద్వారా పునరుద్ధరించుకునే అవకాశం ఉందని, స్థానిక ఎంపీలను సమన్వయం చేసుకుంటూ వాల్తేర్ డివిజన్‌లో పనులు వేగవంతం చేయాలని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. విశాఖలోని నోవోటెల్ హోటల్‌లో మంగళవారం జరిగిన ఈస్ట్ కోస్ట్ రైల్వే, వాల్తేర్ డివిజన్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. డివిజన్ పరిధిలోని పార్లమెంట్ సభ్యులు, రైల్వే అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో ఇటీవల చేపట్టిన పనుల పురోగతి, పార్లమెంట్ సభ్యులు ఇదివరకే చెప్పిన సమస్యలు, వాటి ప్రస్తుత స్థితి గురించి చర్చించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ విశాఖపట్నం రైల్వే స్టేషన్‌ను ఐకానిక్ స్టేషన్‌గా తీర్చిదిద్దాలని.. ఇప్పటికే రూ.492.69 కోట్ల కేటాయింపులు జరిగినట్లు గుర్తు చేశారు. అతి త్వరలో భోగాపురం విమానాశ్రయం ప్రారంభం కానున్న నేపథ్యంలో విజయనగరం రైల్వే స్టేషన్‌పై కూడా కనెక్టివిటీ రద్దీ పెరిగే అవకాశం ఉందన్నారు.
శ్రీకాకుళం నుంచి తిరుపతికి రైలు వేయాలి
శ్రీకాకుళం నుంచి చర్లపల్లికి, శ్రీకాకుళం నుంచి తిరుపతికి నూతన ట్రైన్ సర్వీసుల ఆవశ్యకత ఉందని కేంద్ర మంత్రి రామ్మోహన్ తెలిపారు. అరకు రైలుకు మరిన్ని కోచ్‌లను అనుసంధానం చేయాలని సూచించారు. ప్రస్తుత సందర్భాల్లో శబరిమల లాంటి ప్రాంతాలకు అధికంగా ప్రత్యేక రైళ్లను నడపాలని స్పష్టం చేశారు.
అభివృద్ధి పనులపై అసంతృప్తి
అమృత్ భారత్ స్టేషన్‌ల్లో అభివృద్ధి పనుల ఆలస్యం పట్ల రామ్మోహన్‌నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. త్వరితగతిన వాటిని పూర్తి చేయాలని సూచించారు. సబ్ వేల నిర్మాణంలో నాణ్యతపై పలు ఆరోపణలు వస్తున్నట్టు పేర్కొన్నారు. నీటి నిల్వలు ఉండిపోవడం, పై నుంచి వాటర్ లీకేజీ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని పేర్కొన్నారు.
రైల్వే మంత్రి దృష్టికి తీసుకెళ్తాం:
గొల్ల బాబూరావు, తనూజారాణి
సీనియర్ సిటిజన్లకు, స్పోర్ట్స్ పర్సన్లకు టికెట్ చార్జీలు తగ్గింపు కోసం ఇప్పటికే అనేక వినతులు అందాయని, ప్రత్యేక చొరవ తీసుకుని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ దృష్టికి తీసుకెళ్తానని రాజ్యసభ సభ్యుడు గొల్లబాబూరావు హామీ ఇచ్చారు. తన పార్లమెంట్ పరిధిలో పలు సమస్యలను అరకు ఎంపీ తనూజరాణి ప్రస్తావించారు. అరకుకు మరిన్ని రైళ్లు నడపాలని, ప్రస్తుతం అరకుకు ఉన్న రైళ్లకు కోచ్‌లు అదనంగా ఏర్పాటు చేయాలని రైల్వే మంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు. కార్యక్రమంలో డివిజన్ పరిధిలోని పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్, కలిశెట్టి అప్పలనాయుడు, రైల్వే అధికారులు సప్తగిరి శంకర్ ఉలక, మహేష్ కశ్యప్, స్థానిక అధికారులు పాల్గొన్నారు.


