ఉద్యోగాల పేరిట దంపతులకు టోకరా | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగాల పేరిట దంపతులకు టోకరా

Nov 5 2025 7:13 AM | Updated on Nov 5 2025 7:13 AM

ఉద్యోగాల పేరిట దంపతులకు టోకరా

ఉద్యోగాల పేరిట దంపతులకు టోకరా

● రూ.91 లక్షలు తీసుకొని నిందితుల పరారీ ● గాజువాక పోలీసులను ఆశ్రయించిన బాధితులు ● ఐదుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు ● పరారీలో మరో ఎనిమిది మంది

గాజువాక : ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువ దంపతులను కొంతమంది మోసం చేశారు. వారి నుంచి రూ.91 లక్షలు వసూలు చేసి అదృశ్యమయ్యారు. తాము మోసపోయామని గుర్తించిన బాధితులు గాజువాక పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఐదుగురు నిందితులను మంగళవారం అరెస్టు చేశారు. ఈ కేసులో మరో ఎనిమిది మంది నిందితులు పరారీలో ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. గాజువాక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక చట్టివానిపాలెం రోడ్‌లో నివాసముంటున్న సింగనం అలేఖ్య డయాలసిస్‌లో డిప్లొమా చేసి ప్రస్తుతం నర్సింగ్‌ చదువుతోంది. ఆమె భర్త వినాయకరావు బీటెక్‌ పూర్తి చేసి ఉద్యోగం కోసం చూస్తున్నాడు. ఈ దంపతులకు మంచి ఉద్యోగం కావాలన్న ఆలోచన ఉంది. మల్కాపురం ప్రాంతానికి చెందిన వారి బంధువులు మచ్చ సజిని (గృహిణి), మచ్చ వెంకట నారాయణ (ట్రాన్స్‌పోర్టు సూపర్‌వైజర్‌) దంపతులు విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో పర్మినెంట్‌ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికారు. తాను స్టీల్‌ప్లాంట్‌లో కాంట్రాక్టరుగా పనిచేస్తున్నానని, తనకు మంచి పరిచయాలు ఉన్నాయని నారాయణ చెప్పాడు. ఒక్కో వ్యక్తికి రూ.50 లక్షల చొప్పున ఇస్తే ఏడాది కాలంలో ఉద్యోగం వస్తుందని, ఉద్యోగం వచ్చేవరకు డబ్బు చాలా భద్రంగా ఉంటుందని, అంతవరకు వడ్డీ కూడా ఇస్తామని పేర్కొన్నారు. అనంతరం వారికి పెదగంట్యాడకు చెందిన సీరపు షణ్ముఖ ఆదిత్యకుమార్‌(విద్యార్థి), సీరపు రామ్‌ ప్రసాద్‌ (జొమాటో డెలివరీ బాయ్‌), సీరపు అనిత (గృహిణి)లను పరిచయం చేశారు. వారిని నమ్మిన అలేఖ్య దంపతులు తమ వద్ద ఉన్న డబ్బుతోపాటు తమ బంధువుల వద్ద అప్పుచేసిన డబ్బుతో కలిపి రూ.91,36,500ను వారికి ఇచ్చారు. 2023 ఏప్రిల్‌ నుంచి 2024 ఆగస్టు మధ్యకాలంలో ఈ డబ్బును నిందితులకు అందజేశారు, అందులో సజినికి రూ.19.80 లక్షలు, నారాయణకు రూ.6.02 లక్షలు, షణ్ముఖకు రూ.15.02 లక్షలు, రామ్‌ ప్రసాద్‌కు రూ.6,43,500, అనితకు రూ.6.96 లక్షలను నగదు, ఫోన్‌పే, బ్యాంక్‌ ట్రాన్స్‌ఫర్‌, సీడీఎం మెషీన్‌ డిపాజిట్‌ ద్వారా చెల్లించారు. డబ్బులు తీసుకున్న నిందితులు తొలుత బాధితులతో బాగానే మాట్లాడేవారు. ఎంతకీ ఉద్యోగాలు రాకపోవడంతో వారు ఒత్తిడి చేస్తుండటంతో ఏవో సాకులు చెప్పి వాయిదా వేస్తూ వచ్చారు. చివరకు 2024 ఆగస్టులో మరోసారి రూ.30 వేలు తీసుకున్న తర్వాత అందరూ తమ ఫోన్లను స్విచ్ఛాఫ్‌ చేసి అదృశ్యమయ్యారు. దీంతో తాము మోసపోయామని భావించిన అలేఖ్య దంపతులు గాజువాక పోలీసులను ఆశ్రయించి గోడు వెల్లబోసుకున్నారు. సీఐ ఎ.పార్థసారధి ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించిన పోలీసులు ఈ ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. వారి మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. బాధితుల నుంచి వసూలు చేసిన డబ్బుతో సజిని పెదగంట్యాడలో రెండు ఇళ్లను, నారాయణ ఐదు లారీ ట్రాలర్లు కొనుగోలు చేసినట్టు, మిగిలినవారు ఆస్తులు కొనడంలో సహాయం చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఇంకా ఈ కేసులో ఎనిమిది మంది నిందితులు పరారీలో ఉన్నారని, త్వరలోనే వారిని కూడా అరెస్టు చేస్తామని సీఐ పార్థసారధి ఈ సందర్భంగా తెలిపారు. తాము మోసం చేసినట్టు అరెస్టయిన నిందితులు ఒప్పుకున్నారని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement