గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం
పెదగంట్యాడ: మండలంలోని పాత గంగవరం తీరంలో ఈ నెల 2న గల్లంతైన యువకుడి మృతదేహం అప్పికొండ తీరంలో మంగళవారం లభ్యమైంది. ఈ సంఘటనకు సంబంధించి న్యూపోర్టు సీఐ కామేశ్వరరావు తెలిపిన వివరాలివి. ఒడిశాకు చెందిన బ్రహ్మానందం, తిరుపతి సాహు, భోళాశంకర్ సాహు, పెదగంట్యాడ మండలం సీతానగరానికి చెందిన రట్టి రూపక్ సాయి(22) గంగవరం పోర్టులో కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్నారు. ఈ నెల 2న సాయంత్రం 5 గంటల సమయంలో పాత గంగవరం తీరానికి వెళ్లారు. అక్కడ మాధవస్వామి ఆలయం సమీపంలోని బీచ్ వ్యూ పాయింట్ రాళ్లపై ఎక్కి తీరంలోని అందాలను ఆస్వాదిస్తుండగా రూపక్‌సాయి అదుపుతప్పి సముద్రంలో పడిపోయాడు. మిగిలిన వారు రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. దీనిపై సమాచారం అందుకున్న న్యూపోర్టు పోలీసులు రెండు రోజులుగా ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. డ్రోన్ల సాయంతో జల్లెడ పట్టారు. మంగళవారం మధ్యాహ్నం అప్పికొండ తీరం సమీపంలో యువకుని మృతదేహాన్ని గుర్తించారు. పోస్టు మార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. సీఐ కామేశ్వరరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


