వేర్వేరు సంఘటనల్లో 14 కేజీల గంజాయి స్వాధీనం
తాటిచెట్లపాలెం: గవర్నమెంట్ రైల్వే పోలీసులు, రైల్వే భద్రతా దళం సంయుక్తంగా రైల్వే స్టేషన్‌లో నిర్వహించిన తనిఖీలలో గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న నలుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 14 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సోమవారం ఉదయం మర్రిపాలెం రైల్వే స్టేషన్ సమీపంలో ఆర్‌పీఎఫ్ ఎస్‌ఐలు మమత, అనిల్‌కుమార్ సిబ్బందితో కలిసి ప్రయాణికులను తనిఖీ చేస్తుండగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రకు చెందిన వికాస్, ఒడిశాకు చెందిన జగన్ మాఝీల లగేజీలలో నాలుగు కిలోల గంజాయిని అక్రమంగా తరలిస్తుండగా గుర్తించి, వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం గవర్నమెంట్ రైల్వే పోలీసులకు అప్పగించినట్లు ఆర్‌పీఎఫ్ సిబ్బంది తెలిపారు. మరో ఘటనలో విశాఖ రైల్వే స్టేషన్‌లో జీఆర్‌పీ ఇన్‌స్పెక్టర్ సీహెచ్ ధనుంజయ నాయుడు ఆధ్వర్యంలో జీఆర్‌పీ ఎస్సై కేటీఆర్ లక్ష్మి, ఆర్‌పీఎఫ్ ఎస్సై ఓ మిసీ్త్రలు తమ సిబ్బందితో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన రకుల్ ఎస్కే, ఒడిశాకు చెందిన కార్తీక్ కిల్లో..విశాఖ మీదుగా కేరళకు అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. వీరి నుంచి 10కిలోల గంజాయి స్వాధీనం చేసుకొన్నారు. వీరిని అరెస్టు చేసి రిమాండ్ పంపినట్టు జీఆర్పీ పోలీసులు తెలిపారు.


