డ్రగ్స్ కేసులో ముగ్గురు విద్యార్థుల అరెస్ట్
విశాఖ సిటీ : విశాఖలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు డ్రగ్స్ పట్టుకుని, ముగ్గురు విద్యార్థులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 48 ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. విశాఖలో సోమవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో డీసీపీ (లా అండ్ ఆర్డర్) మేరీప్రశాంతి ఈ కేసు వివరాలు తెలిపారు. ఆమె తెలిపిన మేరకు.. మద్దిలపాలెం చైతన్యనగర్‌లో నివాసముంటున్న పులగం కొండారెడ్డి ఎంబీఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అతడికి అనకాపల్లిలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన మురాడ గీత్‌చరణ్, శ్రీకాకుళం జిల్లా బాలాజీ టెంపుల్ ప్రాంతానికి చెందిన తంగి హర్షవర్ధన్‌నాయుడు స్నేహితులు. వీరు ముగ్గురు మద్యం, మత్తు పదార్థాలకు అలవాటుపడ్డారు. బెంగళూరులోని హర్షవర్ధన్‌నాయుడి స్నేహితుడు సంథన్ నుంచి ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్‌ను తీసుకురావాలని గీత్‌చరణ్‌కి సూచించిన కొండారెడ్డి ఇటునుంచి విమానం, అటునుంచి రైలు టికెట్లు సమకూర్చాడు. గీత్‌చరణ్ అక్టోబర్ 31న విశాఖ నుంచి విమానంలో బెంగళూరు వెళ్లాడు. ఈ నెల 1వ తేదీన కొండారెడ్డి తన స్నేహితుడు డొంక గణేష్ ఫోన్‌పే ద్వారా సంథన్‌కు రూ.25 వేలు పంపించాడు. ఈ డబ్బుతో సంథన్ 50 ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్‌ను కొనుగోలు చేసి, వాటిలో 48 బ్లాట్స్‌ను గీత్‌చరణ్‌కు ఇచ్చాడు. ఆ బ్లాట్స్‌తో అదేరోజు బెంగళూరు నుంచి రైలులో బయలుదేరిన గీత్‌చరణ్ ఆదివారం విశాఖ చేరుకున్నాడు. ఈ డ్రగ్స్ రవాణా గురించి సమాచారం అందటంతో టాస్క్‌ఫోర్స్, ఈగల్ పోలీసులు రైల్వేస్టేషన్ వద్ద నిఘా పెట్టారు. కొండారెడ్డి.. హర్షవర్ధన్‌నాయుడుతో కలిసి గీత్‌చరణ్ వద్దకు వెళ్లి ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్‌ను తీసుకుంటున్న సమయంలో పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 48 ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్‌తో పాటు మూడు మొబైల్స్, ఓలా ఎలక్ట్రిక్ స్కూటీని స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు. ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్ ఇచ్చిన సంథన్ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు చెప్పారు. ఇందులో ఎవరెవరిపాత్ర ఉందన్న విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు ఆమె తెలిపారు.
డ్రగ్స్ కేసులో ముగ్గురు విద్యార్థుల అరెస్ట్


