18 చోరీల కేసుల్లో నిందితుడి అరెస్టు
గాజువాక : ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతున్న పాత నేరస్తుడిని గాజువాక క్రైం పోలీసులు సోమ వారం అరెస్టు చేశారు. అతడి నుంచి 500 గ్రాముల వెండి వస్తువులు, నేరానికి ఉపయోగించిన రెండు ఐరన్ రాడ్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. గాజువాకలోని కై లాసనగర్‌లో నివాసముంటున్న రాంబుద్ధి వేణు గాజువాక హైస్కూల్‌లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. గతనెల 24న ఒడిశాలో ఒక వివాహం నిమిత్తం కుటుంబంతో సహా వెళ్లారు. అయితే, వారి ఇంటి తాళాలు విరగ్గొట్టి ఉన్నాయని పక్కింటివారు 26వ తేదీన ఆయనకు ఫోన్ చేసి సమాచారమిచ్చారు. 27వ తేదీన తిరిగి వచ్చిన ఆయన ఇంటి మెయిన్ డోర్ తాళాలు పగులగొట్టి ఉండటం గుర్తించాడు. ఇంటి లోపల బీరువా, లాకరు తెరిచి ఉండగా..అందులోని 500 గ్రాముల వెండి వస్తువులు కనిపించడంలేదని గాజువాక క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు క్రైం డీసీపీ లతా మాధురి ఆధ్వర్యంలో సీఐ కె.శ్రీనివాసరావు,ఎస్‌ఐ రుక్మంగధరరావు కేసు దర్యాప్తు ప్రారంభించారు. పెదగంట్యాడ ప్రాంతానికి చెందిన గణేష్ అలియాస్ బొండాలోడు ఈ దొంగతనానికి పాల్పడినట్టు గుర్తించి సోమవారం రిమాండ్‌కు తరలించారు. కాగా, నిందితుడిపై గాజువాక, దువ్వాడ, న్యూపోర్టు, మల్కాపురం పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇప్పటికే 18 కేసులున్నట్టు క్రైం సీఐ తెలిపారు.
18 చోరీల కేసుల్లో నిందితుడి అరెస్టు


