ప్రజాభిప్రాయంతో కూటమికి కనువిప్పు
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రచ్చబండ
కోటి సంతకాల సేకరణకు విశేష స్పందన
ప్రజా సంపదను కొందరికే కట్టబెడుతున్నారు
వైఎస్సార్ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ధ్వజం
సీతంపేట: కూటమి ప్రభుత్వం ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటూ.. అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని వైఎస్సార్ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు మండిపడ్డారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాజీ కార్పొరేటర్ మువ్వల పోలారావు ఆధ్వర్యంలో జీవీఎంసీ 25వ వార్డు గురుద్వారా కూడలి సమీపంలో ‘రచ్చబండ– కోటి సంతకాల సేకరణ’ కార్యక్రమం జరిగింది. కె.కె.రాజు ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులు, యువత, మేధావుల నుంచి సంతకాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి నాయ కులు ఎన్నికలకు ముందు సంపద సృష్టిస్తామని హామీలిచ్చి, అధికారంలోకి వచ్చాక ప్రజల ఆస్తులను, రాష్ట్ర సంపదను పప్పుబెల్లంలా చంద్రబాబు వెనుక ఉన్న కొంత మంది వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో వైద్య విద్యను పేద మధ్య తరగతి ప్రజలకు చేరువ చేసేలా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 17 మెడికల్ కళాశాలలకు అన్ని రకాల ఫైనాన్షియల్, అడ్మినిస్ట్రేటివ్ అనుమతులు తెచ్చారని గుర్తు చేశారు. ప్రతి మెడికల్ కళాశాలలో 500 పడకల ఆసుపత్రిని నిర్మించి పేదలకు ఉచిత వైద్యం అందుబాటులోకి తెచ్చేలా కృషి చేశారన్నారు. పేద పిల్లలను వైద్య విద్యకు, ప్రజలను ఉచిత వైద్యానికి దూరం చేసేలా కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తూ నిర్ణయం తీసుకుందని మండిపడ్డారు. చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో ప్రజల అభిప్రాయాలను కోటి సంతకాల రూపంలో సేకరించి గవర్నర్‌కు నివేదిస్తామన్నారు. ప్రజాభిప్రాయంతోనైనా కూటమి నాయకులకు కనువిప్పు కావాలన్నారు. విశాఖ జిల్లాలో కోటి సంతకాల సేకరణకు విశేష స్పందన లభిస్తోందని, యువత, మేధావులు స్వచ్ఛందంగా సంతకాలు చేసి కూటమి ప్రభుత్వ నిర్ణయంపై వ్యతిరేకతను వెల్లడిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు మువ్వల సంతోష్ భోగవిల్లి గోవింద్, సానబోయిన సురేష్ సారిపిల్లి సంతోష్ నూకరాజు, గుదే రాజు, శ్రవణ్, అప్పలరాజు, సూరిబాబు, బొమ్మాళి రవి, బోర గోవింద్, అశోక్, జోరీగల గణేష్, బడే శ్రీను, అలమండ శంకర్, దిమిలి శ్రీను, బొట్టా నాగు, బొట్టా పైడిబాబు, నమ్మి మహేష్, బొట్టా శ్రీను, పరశురామ్, వీరమ్మ, ఉమ, ఉద్మ, సంధ్య కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.
భక్తుల మృత్యువాత ప్రభుత్వ వైఫల్యమే..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజల ప్రాణాలకు భద్రత లేకుండా పోయిందని కె.కె. రాజు అన్నారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోవడానికి ప్రభుత్వ వైఫల్యం, నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. అడిగితే ప్రైవేట్ ఆలయం అని తప్పించుకోవాలని చంద్రబాబు ప్రభుత్వం చూస్తోందన్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఏమి జరుగుతుందో ప్రభుత్వానికి తెలియదా, వ్యవస్థలపై పట్టులేదా అని ప్రశ్నించారు. సనాతన ధర్మం, హైందవ ధర్మం అంటూ మాట్లాడే ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు ప్రజల భద్రత విషయంలో చిత్తశుద్ధి ఏమైందని ప్రశ్నించారు. శ్రీకాకుళం ఘటనలో చనిపోయిన భక్తుల ఆత్మకు శాంతి చేకూరాలన్నారు.


