సిగ్గుంటే కూటమి నుంచి బీజేపీ, జనసేన బయటకు రావాలి
సాక్షి, విశాఖపట్నం : సింహాచలం అప్పన్న దేవాలయ భూములను ప్రభుత్వం అప్పనంగా విదేశీ సంస్థలకు కట్టబెట్టేందుకు అడ్డగోలు వ్యవహారాలు నడిపిస్తోందని హిందూ సంఘాల నాయకుడు తురగా శ్రీరామ్ వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వ భూ పందేరంపై ఆయన ఆదివారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేశారు. దేవదాయ, ధర్మాదాయ శాఖ దీనికి వత్తాసు పలుకుతూ సింహాద్రి అప్పన్న స్వామికి పంగనామాలు పెడుతోందని విమర్శించారు. విలువైన సింహాచలం భూముల్ని తక్కువ ధరకు చూపిస్తూ కాకిలెక్కలతో ప్రజల్ని మోసం చేయాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అదానీ, గూగుల్ కోసం రూ.9000 కోట్ల విలువైన సింహాచలం దేవస్థాన భూములను కట్టబెట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంపై ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతి హిందువూ వ్యతిరేకిస్తున్నాడన్నారు. అధికారాన్ని అడ్డంపెట్టుకొని భూముల్ని ఇష్టారాజ్యంగా దోచేయాలని చూస్తుంటే కూటమిలో ఉన్న బీజేపీ, జనసేన ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. ఇంత అన్యాయంగా దేవుడి భూములను కట్టబెడుతున్నప్పుడు పవన్ కల్యాణ్ ఎందుకు నోరు మెదపడం లేదన్నారు. నిజంగా హిందుత్వంపై బీజేపీకి, జనసేనకు చిత్తశుద్ధి ఉంటే.. కూటమి నుంచి రెండు పార్టీలూ వెంటనే బయటకు రావాలని శ్రీరామ్ డిమాండ్ చేశారు.


