భక్తుల మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి
కూటమి ప్రభుత్వంలో భక్తులకు భద్రత లేదు
ప్రజల్లో ఉన్న వ్యతిరేకతతో కూటమి డైవర్షన్ పాలిటిక్స్
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి
కాశీబుగ్గ మృతుల ఆత్మకు శాంతి కోరుతూ కొవ్వొత్తుల ర్యాలీ
బీచ్‌రోడ్డు: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన సంఘటనలో మృతి చెందిన భక్తుల మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని వైఎస్సార్ సీపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ఆధ్వర్యంలో ఆదివారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. మృతి చెందిన భక్తుల ఆత్మకు శాంతి కోరుతూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ నాయకులు కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల ప్రజలకే కాదు, భక్తులకు కూడా భద్రత కరువైందని కేకే రాజు, వరుదు కల్యాణి ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజల భద్రత, పాలనను గాలికి వదిలేసి, ప్రభుత్వం కేవలం వైఎస్సార్ సీపీ నాయకులను వేధించడానికే పనిచేస్తోందని మండిపడ్డారు. దేవాలయాల్లో భక్తులు మరణించినా లేదా రాష్ట్రంలో ఏదైనా పెద్ద సంఘటనలు జరిగినా, ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకతను మళ్లించేందుకు ప్రభుత్వం వైఎస్సార్ సీపీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తోందని వారు తీవ్రంగా విమర్శించారు. కాశీబుగ్గ ఘటనపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకే తప్పుడు కేసులో జోగి రమేష్‌ను అరెస్టు చేశారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల్లో భద్రత లేకుండా పోయిందని, అందుకే తిరుపతి, సింహాచలంలో, ఇప్పుడు కాశీబుగ్గలో భక్తులు మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. భక్తుల మరణాలకు కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించాలని, మృతుల కుటుంబాలకు భారీ నష్టపరిహారం అందించాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం మృతి చెందిన భక్తుల ఆత్మశాంతి కోసం రెండు నిమిషాల పాటు నాయకులు మౌనం పాటించారు. కార్యక్రమంలో పార్టీ తూర్పు సమన్వయ కర్త మొల్లి అప్పారావు, గాజువాక సమన్వయ కర్త దేవన్‌రెడ్డి, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణి కుమారి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు బోణి శివరామకృష్ణ, జిల్లా అధికార ప్రతినిధి పల్లా దుర్గారావు, వార్డు కార్పొరేటర్లు, అధ్యక్షులు పాల్గొన్నారు.


