వరుస విషాదాలకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం, వైఫల్యం కారణంగానే వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయ ని వైఎస్సార్ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు విమర్శించారు. విశాఖలో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం, కాశీబుగ్గలో ఆలయంలో తొక్కిసలాట ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనాలని ఆయన మండిపడ్డారు. ఎంవీపీ కాలనీలోని సమత డిగ్రీ కళాశాల విద్యార్థి కోన సాయితేజ ఆత్మహత్య సంఘటన తనను తీవ్రంగా కలచివేసిందని రాజు విచా రం వ్యక్తం చేశారు. విద్యాసంస్థల్లో విద్యార్థులపై వేధింపులు, మానసిక ఒత్తిడి రోజురోజుకూ పెరుగుతున్నా ప్రభుత్వం దృష్టి సారించడం లేదన్నారు. సాయితేజ మరణానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కాశీబుగ్గ ఘటనపై దిగ్భ్రాంతి: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వర ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో తొమ్మిది మంది భక్తులు మృతి చెందడం పట్ల కేకే రాజు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆలయాల వద్ద ఇలాంటి దురదృష్టకర సంఘటనలు పెరిగిపోయాయన్నారు. కార్తీక మాసంలో భక్తుల రద్దీని అంచనా వేయడంలో, తగిన భద్రతా చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం, పోలీస్ ఇంటెలిజెన్స్ పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. తిరుపతి, సింహాచలం ఘటనల తర్వాత కూడా పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందన్నారు. ఈ రెండు ఘటనల్లోనూ మరణించిన వారి కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని కేకే రాజు డిమాండ్ చేశారు.
వైఎస్సార్ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు


