పార్కులు ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలి
కలెక్టర్ హరేందిర ప్రసాద్
మహారాణిపేట: నగరంలోని పార్కులు, పర్యాటక ప్రాంతాలను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఎం. ఎన్. హరేందిర ప్రసాద్ ఆదేశించారు. ఈ నెల 14, 15వ తేదీల్లో జరిగే సీఐఐ భాగస్వామ్య సదస్సుకు దేశ, విదేశాల నుంచి ప్రముఖులు వస్తున్నారని.. వారు పర్యాటక ప్రాంతాలను వీక్షించే అవకాశం ఉందన్నారు. అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని సూచించారు. గాలా డిన్నర్ ఏర్పాటుకు తగిన ప్రదేశాన్ని గుర్తించడంలో భాగంగా శనివారం ఆయన వివిధ పార్కులను సందర్శించారు. వీఎంఆర్డీఏ పార్కు, ఎంజీఎం పార్కు, సీ–హారియర్స్, టీయూ–142, సబ్ మైరెన్, తెన్నేటి పార్కులను పరిశీలించి.. అధికారులతో చర్చించారు. పార్కింగ్, భోజన వసతి, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు అనువుగా ఉండే ప్రాంతాలపై ఆరా తీశారు. పార్కుల్లో అవసరమైన మేరకు అభివృద్ధి పనులు చేపట్టాలని, మరమ్మతులు చేయించాలని, మొక్కలు నాటాలని సూచించారు. ఆయన వెంట వీఎంఆర్డీఏ సీఈ వినయ్ కుమార్, ఎస్‌ఈ భవానీ శంకర్, కార్యదర్శి మురళీకృష్ణ, డీఎఫ్‌వో శివాని ఇతర అధికారులు ఉన్నారు.


