
కూటమి నిర్లక్ష్యం.. పేదలకు ప్రాణ సంకటం
ఆరోగ్యశ్రీ బిల్లుల పెండింగ్‌తో
పేదలకు ఆరోగ్య భరోసా దూరం
రోగులను జలగల్లా పీల్చుతున్న కార్పొరేట్ ఆస్పత్రులు
వైద్యం పేరుతో
అడ్డూ అదుపు లేకుండా దోపిడీ
అవసరం లేకపోయినా పరీక్షలు
మహారాణిపేట: జిల్లాలోని పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించే వ్యవస్థను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసే దిశగా అడుగులు వేస్తోందన్న విమర్శలు తీవ్రమవుతున్నాయి. ఒకవైపు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు అందుబాటులో లేక రోగులు అవస్థలు పడుతుంటే, మరోవైపు కార్పొరేట్ ఆస్పత్రులకు చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోవడంతో నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో వైద్య సేవలు నిలిచిపోయాయి.
ఆరోగ్యశ్రీకి అనారోగ్యం
పేదలకు భరోసాగా ఉన్న ఆరోగ్యశ్రీ ప్రస్తుతం అనారోగ్యశ్రీగా మారిందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద అందించిన వైద్యానికి సంబంధించి కూటమి సర్కారు నుంచి బిల్లులు చెల్లించకపోవడంతో నెట్‌వర్క్ ఆస్పత్రులు సేవలను నిలిపివేశాయి. దీంతో నాలుగు రోజులుగా కార్పొరేట్, నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందక రోగులు అల్లడిపోతున్నారు. జిల్లాలో బకాయిలు చెల్లించకపోవడంతో 62 నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో ఓపీ, ఐపీ సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. అన్ని రకాల వైద్య సేవలు, శస్త్ర చికిత్సలు నిలుపుదల కావడంతో పేద రోగుల బాధలు వర్ణనాతీతంగా మారాయి. నెట్‌వర్క్ ఆస్పత్రులకు వచ్చే పేద రోగులకు ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లాలని వైద్యమిత్రులు, ఆరోగ్యమిత్రులు సూచనలు ఇస్తున్నారు. ఈ పరిస్థితి పేద రోగులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు కూడా వైద్య సేవల్లో ఇబ్బందులు కలిగిస్తోంది.
పడకేసిన పల్లె వైద్యం
పల్లెల్లో వైద్యం పడకేసింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ‘ఇన్ సర్వీస్ పీజీ కోటా’ పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ పీహెచ్‌సీల్లో వైద్యులు గత నెల 26 నుంచి ఆందోళన చేస్తున్నారు. గత నెల 29 నుంచి ఓపీలను బహిష్కరించిన వైద్యులు, అక్టోబర్ 1వ తేదీ నుంచి సమ్మె బాట పట్టారు. దీంతో రోగులకు అరకొరగా సేవలు అందుతున్నాయి. సీజనల్ వ్యాధులు వ్యాపిస్తున్న సమయంలో వైద్యులు లేకపోవడంతో జ్వరాల బారిన పడుతున్న పల్లె ప్రజలకు స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్టులే డాక్టర్ల అవతారం ఎత్తి మందు బిళ్లలు ఇచ్చి పంపుతున్నారు.
పేదల వైద్యంపై చిన్నచూపు
ఒకవైపు ఆరోగ్యశ్రీ సేవలకు అంతరాయం, మరోవైపు పీహెచ్‌సీల్లో వైద్యుల సమ్మెతో వైద్య సేవలు నిలిచిపోవడంతో పేద రోగులు వైద్యం కోసం అల్లడిపోతున్నారు. దాదాపు ఏడాదిన్నర కాలంగా వైద్య సేవలు అందించిన నెట్‌వర్క్ ఆస్పత్రులకు కూటమి సర్కారు చిల్లిగవ్వ కూడా విడుదల చేయలేదనే విమర్శలు ఉన్నాయి. దీంతో ఆస్పత్రుల నిర్వహణపై తీవ్ర ప్రభావం పడింది. బకాయిలు చెల్లించకుంటే తాము ఆస్పత్రులను నడపలేమని ఏపీ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్ (ఆశా) ప్రకటించింది. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా పేదలకు అందే ఆరోగ్యశ్రీ సేవలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు వైద్య సేవలు అందించే ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్‌ఎస్), వర్కింగ్ జర్నలిస్టుల వైద్య సేవలకు కూడా కొంతవరకు బ్రేక్ పడింది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స కోసం వెళ్తే అవసరం లేని అనేక పరీక్షలు రాస్తూ, అధిక ఫీజులు వసూలు చేయడంతో పేదలకు వైద్యం అందని ద్రాక్షగా మారిందని, వైద్యం పేరు ఎత్తితేనే భయపడే పరిస్థితి నెలకొందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.