అడ్డగోలు నిల్వలు.. అనుమతిలేని అమ్మకాలు | - | Sakshi
Sakshi News home page

అడ్డగోలు నిల్వలు.. అనుమతిలేని అమ్మకాలు

Oct 13 2025 6:20 AM | Updated on Oct 13 2025 6:20 AM

అడ్డగోలు నిల్వలు.. అనుమతిలేని అమ్మకాలు

అడ్డగోలు నిల్వలు.. అనుమతిలేని అమ్మకాలు

విశాఖ జిల్లాలో విచ్చలవిడిగా

బాణసంచా నిల్వలు

తయారీ కేంద్రాలు, అమ్మకాలపై

పర్యవేక్షణ లోపం

ఇష్టారాజ్యంగా అనుమతులకు

కూటమి నేతల సిఫార్సులు

జీ హుజూర్‌ అంటున్న అధికారులు

గత ఏడాది 524 షాప్‌లు..

ఈసారి 700కు పెరిగే అవకాశం

ఇప్పటికే శివారు ప్రాంతాల్లో

అక్రమంగా బాణసంచా నిల్వలు

సాక్షి, విశాఖపట్నం/మహరాణిపేట : దీపావళి పండగకు మరో వారం రోజులే ఉంది. దీంతో బాణసంచా తయారీ కేంద్రాలు, విక్రయ దుకాణదారులు ప్రభుత్వ నిబంధనలు పాటించకుంటే లైసెన్సులు రద్దు చేస్తామని అధికారులు మొక్కుబడి హెచ్చరికలు చేస్తున్నారు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో నిబంధనలు పాటించకుండా మందుగుండు సామగ్రిని వ్యాపారులు విక్రయిస్తున్నారు. ఓవైపు పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల సీజన్‌ కావడం.. దీపావళి సమీపిస్తుండటంతో.. విశాఖ జిల్లాపై బాణసంచా పడగ విప్పుతోంది. నిత్యావసరాల మాటున ఇప్పటికే పట్టణానికి పెద్దఎత్తున బాణసంచా నిల్వలు చేరుకున్నట్టు విశ్వసనీయ సమాచారం.

అంతా కూటమి కనుసన్నల్లోనే..!

అధికారికంగా దీపావళి సామగ్రి విక్రయించేందుకు ఏయూ మైదానంతోపాటు ఎంవీపీ కాలనీలో ఏఎస్‌ రాజా కాలేజీ గ్రౌండ్స్‌, బీచ్‌ రోడ్డులో ఓ ఫంక్షన్‌ హాల్‌, గాజువాక, గోపాలపట్నం, షీలానగర్‌, స్టీల్‌ప్లాంట్‌ తదితర ప్రాంతాల్లో ప్రత్యేక స్టాల్స్‌ ఏర్పాటు చేస్తుంటారు. ఈ స్టాల్స్‌కు జీవీఎంసీ, రెవెన్యూ, వాణిజ్య పన్నులశాఖ, పోలీసులు, అగ్నిమాపక శాఖ అనుమతులు కావాలి. అయితే.. ఈ ప్రభుత్వ విభాగాల అనుమతులు కావాలంటే.. స్థానిక కూటమి నేతల అనుమతులు తప్పనిసరిగా మారింది. తమ అనుచరులకు, తర్వాత ఎవరు ఎక్కువ మొత్తం ముట్టజెబితే వారికే స్టాల్స్‌కు పర్మిషన్లు ఇవ్వాలంటూ ఇప్పటికే ఆయా విభాగాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికార పార్టీ నేతలతో పాటు తామేం తక్కువ తినలేదంటూ.. తమ చేతులు కూడా తడిపితేనే అనుమతులిచ్చేందుకు అధికారులు సైతం సిద్ధమవుతున్నారు. ఈ లెక్కన ఈసారి ఇష్టారాజ్యంగా విక్రయాలకు పర్మిషన్లు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. గతేడాది 524 దుకాణాలకు అనుమతులివ్వగా.. ఈసారి 700 దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

శివార్లలో తయారీ కేంద్రాలు

ఒడిశా, తమిళనాడు నుంచి ఎక్కువగా ఇక్కడికి బాణాసంచా వస్తుంటుంది. విజయనగరం నుంచి కూడా తీసుకొస్తుంటారు. వీటిలో ఎక్కువగా చైనా టపాసులు దిగుమతువుతున్నాయి. బ్రాండెడ్‌ టపాసులపై 18 శాతం జీఎస్టీతో పాటు బాణసంచా విక్రయ లైసెన్సులపైన మరో 10 శాతం జీఎస్టీ విధిస్తుంటారు. మొత్తం 28 శాతం పన్ను చెల్లించాలి. దీనికి తోడు.. కూటమి నేతలకు, లైసెన్స్‌ కోసం ఆయా విభాగాధికారులకు ముడుపులు అదనం. దీంతో అధిక లాభాలకోసం కొందరు సొంత తయారీ కేంద్రాల్ని గుట్టుచప్పుడు కాకుండా నడుపుతున్నట్లు సమాచారం. కొంతమంది అనుమతుల్లేకుండా విచ్చలవిడిగా మందుగుండు సామగ్రి తయారీని కుటీర పరిశ్రమగా మార్చుకుంటున్నారు. పైగా విధివిధానాలను పాటించకపోవడంతో పలు ప్రాంతాల్లో ఈమధ్య కాలంలో భారీ విస్ఫోటనం జరిగి భయానక పరిస్థితులు సంభవిస్తున్న విషయం తెలిసిందే.

విచ్చలవిడిగా ముడిసరకు

బాణసంచా తయారీకి వినియోగించే ముడిసరకు గన్‌న్‌పౌడర్‌, కోల్‌ పౌడర్‌, సల్ఫర్‌, ఐరన్‌ కోర్‌, సురేకారం ఎక్కడికక్కడ బహిరంగ దుకాణాల్లో దొరుకుతోంది. దీంతో పలువురు వాటిని కొనుగోలు చేసి స్వయంగా తయారీకి సిద్ధమవుతున్నారు. ఇటీవల విజయదశమి వేడుకల సందర్భంగా భీమిలి నియోజకవర్గం వలందపేటలో మందుగుండు సామగ్రి తయారీకి ప్రయత్నించగా రాత్రివేళ భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే తేరుకున్నట్లు నటించిన అధికారులు, పోలీసులు.. ఆనందపురం, పద్మనాభం, భీమిలి, భోగాపురం మండలాల్లో బాణసంచా తయారీ కేంద్రాలపై పోలీసులు దాడులు చేసి భారీ మొత్తంలో మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఆనందపురం మండలంలో శొంఠ్యాం, పెద్దిపాలెం, వెల్లంకి, నేల్తేరు, దిబ్బడిపాలెం గ్రామాల్లో విశాఖ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు చేశారు. పద్మనాభం మండలంలో అర్చకులవానిపాలెం వద్ద ఇద్దరిపై కేసులు నమోదు చేశారు. చిన్న చిన్నగా పల్లెల్లో విక్రయించేందుకు తయారు చేస్తున్న వారిపై ప్రభుత్వం ప్రతాపం చూపిస్తుందే తప్ప.. కూటమి నేతల అండతో భారీ మొత్తంలో తయారీ కేంద్రాలు నడుపుతున్న వాటివైపు కన్నెత్తి చూడటం లేదు. భీమిలి, పద్మనాభం, రెడ్డిపల్లి, పాండ్రంగి, కొవ్వాడ, కురపిల్లి, నియోజకవర్గ సరిహద్దు ప్రాంతాలు కవులవాడ, తుడాం, బసవపాలెం గ్రామాల్లోనూ భారీ తయారీ కేంద్రాలు ఉన్నట్లు సమాచారం.

వెలుగుల పండగ దీపావళి సమీపిస్తోంది. దీంతో బాణసంచా గుట్టుగా మహా నగరానికి

చేరుతోంది. దసరా నుంచే కొందరు వ్యాపారులు ఒడిశా, తమిళనాడుల నుంచి బాణసంచా నిల్వలు తెచ్చినట్టు తెలుస్తోంది. అధికార కూటమి నేతలు చెబితే ఇష్టారాజ్యంగా అనుమతులిచ్చేందుకు పోలీస్‌, రెవెన్యూ, అగ్నిమాపక, వాణిజ్య పన్నుల శాఖ అధికారులు జీహుజూర్‌ అంటున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేలా అక్రమ నిల్వలున్న ప్రాంతాల్లో మాత్రం మొక్కుబడి తనిఖీలతో నిబంధనలు గాలికొదిలేస్తున్నారు.

అనుమతులు లేకుండానే నిల్వలు

ఇప్పటికే బాణసంచాని తీసుకొచ్చి.. పర్మిషన్లు రాగానే విక్రయించేందుకు వ్యాపారులు అనధికారికంగా ముందస్తు నిల్వలు ఏర్పాటు చేసుకున్నారు. శివారు ప్రాంతాల్లోని గోదాములు, ఇళ్లల్లో గుట్టుచప్పుడు కాకుండా నిల్వ చేశారు. అయితే.. ఇందుకోసం ఫారం–26 ప్రకారం అధికారులు అనుమతులు తీసుకోవాలి. జనావాసాలు, నగర నడిబొడ్డును బాణసంచా నిల్వలు నిషేధం. ఇవేమీ పట్టించుకోకుండా అధికార పార్టీల అండతో.. కొందరు వ్యాపారులు ఇష్టారాజ్యంగా నిల్వలుంచారని తెలుస్తోంది. ఎక్కడెక్కడ నిల్వలున్నాయో అధికారులకు తెలిసినా కూటమి నేతలు అటువైపు వెళ్లొద్దనే ఆదేశాలతో సైలెంట్‌ మోడ్‌లో పనిచేసుకుంటున్నారు. దీంతో.. వ్యాపారులు ఇష్టం వచ్చినట్లుగా ప్రమాదకరంగా వ్యాపారాలు చేసుకుంటూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement