
ప్రభుత్వ స్థల ఆక్రమణను అడ్డుకున్న గ్రామస్తులు
తగరపువలస: ఆనందపురం మండలం పాలవలస పంచాయతీ సర్వే నెం.82లో శనివారం అర్ధరాత్రి దాటాక గుర్తు తెలియని వ్యక్తులు కొండను తొలచి, చెట్లను తొలగించి షెడ్ నిర్మించడాన్ని గ్రామస్తులు పసిగట్టారు. పంచాయతీలో 21 ఎకరాల వరకు ప్రభుత్వ భూమి ఉండగా సదరు ఆక్రమణదారుడు సుమారు మూడున్నర ఎకరాల్లో చదును చేస్తున్నట్టు గుర్తించారు. ఈ ఆక్రమణకు వ్యతిరేకంగా ఆదివారం ఉదయం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. పాక్షికంగా చేపట్టిన షెడ్‌ను అడ్డుకుని కూలీలను చెదరగొట్టారు. రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ తమ పంచాయతీకి ప్రభుత్వ భూమి ఇక్కడ తప్ప మరెక్కడా లేదన్నారు. ప్రస్తుతం ఆక్రమణదారుడు చదును చేస్తున్న మూడున్నర ఎకరాల్లో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం స్థానికులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రతిపాదించిందన్నారు. ఎన్నికలు రావడంతో ఈ ప్రక్రియకు ఆటంకం కలిగిందన్నారు. గతంలో ఈ సర్వే నంబర్‌లో ఇద్దరు దళిత వ్యక్తులు, ఒక విశ్రాంత ఆర్మీ ఉద్యోగి తమకు భూములు ఉన్నట్టు ముందుకురాగా తామంతా పార్టీలకు అతీతంగా అడ్డుకున్నామన్నారు. భవిష్యత్తులో కూడా పంచాయతీకి సంబంధం లేని వ్యక్తులు ఇక్కడ ఆక్రమణకు ప్రయత్నిస్తే వారి ఆటలు సాగనివ్వబోమని హెచ్చరించారు. జాతీయరహదారిని ఆనుకుని దుక్కవానిపాలెం టోల్‌గేట్ సమీపంలోఉన్న ఈ భూమి విలువ ఎకరం రూ.5 కోట్లు పైనే ఉంటుందని గ్రామస్తులు తెలిపారు. ఇదే సర్వే నంబర్‌లో కొన్ని ప్రభుత్వ భూములకు సంబంధించి వివాదాలు న్యాయస్థానంలో ఉన్నట్లు పేర్కొన్నారు. అనంతరం గ్రామస్తులే స్వయంగా యంత్రాలు తీసుకొచ్చి సర్వే నెం.82లో జంగిల్ క్లియరెన్స్ చేసుకున్నారు. వీఆర్వో దుర్గా రమేష్ అక్కడకు చేరుకుని ప్రభుత్వ స్థలాల్ని ఆక్రమిస్తే చర్యలు తప్పవన్నారు. ఎవరికై నా భూములకు సంబంధించి యాజమాన్య హక్కులు ఉంటే తహసీల్దార్‌ను సంప్రదించాలని సూచించారు.

ప్రభుత్వ స్థల ఆక్రమణను అడ్డుకున్న గ్రామస్తులు