
నలుగురి జీవితాల్లో వెలుగులు
ఆరిలోవ: బ్రెయిన్ డెడ్ మహిళ అవయవాల ద్వారా మరో నలుగురి జీవితాల్లో వెలుగులు నింపారు. నగరంలోని విశాఖ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(విమ్స్)లో జరిగిన ఈ అవయదానం గురించి డైరెక్టర్ డాక్టర్ కె.రాంబాబు తెలిపిన వివరాలు.. జీవీఎంసీ 9వ వార్డు పరిధి విశాలాక్షినగర్‌కు చెందిన కె.అన్నపూర్ణ(50) హనుమంతవాక వద్ద శనివారం రోడ్డు దాటుతుండగా ద్విచక్రవాహనం ఢీకొని తలకు తీవ్ర గాయమైంది. అధిక రక్తస్రావంతో ఉన్న ఆమెను కుటుంబ సభ్యులు విమ్స్‌లో చేర్చారు. చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు ఆదివారం నిర్ధారించారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులకు అవయవదానంపై అవగాహన కల్పించారు. వారు అంగీకరించడంతో జీవన్‌దాన్ రాష్ట్ర కోఆర్డినేటర్, విమ్స్ డైరెక్టర్ డాక్టర్ కె.రాంబాబుకు వైద్యులు విషయం తెలిపారు. ఆయన అనుమతితో బ్రెయిన్ డెడ్ అయిన అన్నపూర్ణ శరీరం నుంచి కాలేయం, ఊపిరితిత్తులు, కార్నియాలను సేకరించారు. వాటిని జీవన్‌దాన్ ప్రొటోకాల్ ప్రకారం సీరియారిటీ జాబితాను అనుసరించి హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి నగర పోలీస్ కమిషనర్ శంఖభ్రత బాగ్చి ఆదేశాలతో గ్రీన్ చానల్ ద్వారా తరలించారు. సాయంత్ర 6.45కు అన్నపూర్ణ శరీరం నుంచి తొలగించిన అవయవాలను బీఆర్‌టీఎస్ మార్గంలో అడవివరం, సింహాచలం, గోపాలపట్నం, ఎన్‌ఏడీ మీదుగా విశాఖ ఎయిర్‌పోర్టుకు చేర్చారు. అక్కడి నుంచి విమానంలో హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా అవయవాలు దానం చేయడానికి ముందుకు వచ్చిన అన్నపూర్ణ కుటుంబ సభ్యులను రాంబాబు అభినందించారు. ఇంతవరకు విమ్స్‌లో బ్రెయిన్ డెడ్ ఆయిన ఐదుగురు నుంచి అవయవాలు సేకరించి పలువురి జీవితాల్లో వెలుగులు నింపినట్లు తెలిపారు.