
భక్తి మార్గంలో తొలి అడుగు.. శ్రీప్రభుపాద ఆశ్రయం
తగరపువలస: ఆనందపురం మండలం గంభీరం ఐఐఎంవీ రోడ్డులోని హరేకృష్ణ వైకుంఠంలో హరేకృష్ణ మూవ్‌మెంట్ ఆధ్వర్యంలో శ్రీరాధా మదన్ మోహన్ మందిరంలో 120 మంది భక్తులు ఆదివారం శ్రీ ప్రభుపాద ఆశ్రయం స్వీకరించారు. ఈ సందర్భంగా మూవ్‌మెంట్ అధ్యక్షుడు నిష్క్రించిన భక్తదాస మాట్లాడుతూ ప్రభుపాద ఆశ్రయం అంటే హరేకృష్ణ ఆధ్యాత్మిక మార్గంలో ఆధ్యాత్మిక వికాసం కొరకు ప్రభుపాదుని గురువుగా స్వీకరించడమని తెలిపారు. ఆశ్రయం స్వీకరించిన భక్తులు ఇకపై రోజూ హరేకృష్ణ మహామంత్ర జపం చేస్తూ శ్రీభక్తి వేదాంత స్వామి ప్రభుపాద రచించిన భగవద్గీత, భాగవతం వంటి రచనలు చదువుతూ సాధన చేయాలన్నారు. టీ, కాఫీ తీసుకోరాదని, పందెం, జూదం వంటి వాటికి దూరంగా ఉండాలన్నారు. అనంతరం దామోదర దీపోత్సవంలో భాగంగా దామోదర అష్టకం వివిధ సంగీత వాయిద్యాల నడుమ లయబద్ధంగా ఆలపించారు. శ్రీరాధా మదన్ మోహన్‌లకు నెయ్యి దీపాలతో హారతులు ఇచ్చారు. కార్యక్రమంలో జితమిత్ర దాస స్వామీజీ, అంబరీస దాస భక్తులకు దామోదర దీపోత్సవం ప్రాముఖ్యతను వివరించారు.