
పీడీఎస్‌వో జిల్లా మహాసభ విజయవంతానికి పిలుపు
బీచ్‌రోడ్డు: ఎంతో చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ఆంధ్ర విశ్వవిద్యాలయం సరిపడా అధ్యాపకుల్లేక డిపార్ట్‌మెంట్లకు డిపార్ట్‌మెంట్లే మూతపడుతున్నాయని పీడీఎస్‌వో విశాఖ జిల్లా అధ్యక్షుడు పి.విశ్వనాథ్ తెలిపారు. ఈ నెల 15న ద్వారకానగర్‌లోని విశాఖ పౌర గ్రంథాలయంలో నిర్వహించనున్న పీడీఎస్‌వో ‘విశాఖ జిల్లా మహాసభ’ను విజయవంతం చేయాలని కోరుతూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మహాసభ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీకి 111 మంది ప్రొఫెసర్లు, 201 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 414 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు కావాలన్నారు. ఏళ్ల తరబడి పోస్టుల్ని భర్తీ చేయకుండా యూనివర్సిటీని నిర్వీర్యం చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆక్షేపించారు. జిల్లా కార్యదర్శి వి.లక్ష్మి మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ హాస్టళ్ల పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు. తాగునీటి సమస్య, నాసికమైన ఆహారం, రెగ్యులర్ ఆరోగ్య పరీక్షలు నిర్వహించక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో జిల్లాలోని విద్యారంగ సమస్యల పరిష్కారానికి చేపట్టాల్సిన కార్యాచరణ రూపకల్పనకు జిల్లా మహాసభను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మహాసభకు ఏయూ మహాసభకు విద్యార్థులు, మేధావులు, ప్రజాతంత్రవాదులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో విశాఖ జిల్లా కమిటీ సభ్యులు సతీష్‌కుమార్, జానకి, లక్ష్మణ్, ఉదయ్‌కిరణ్, ఢిల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.