
తీరానికి చేరిన మత్స్యకారుడి మృతదేహం
పరవాడ: మండలంలోని ముత్యాలమ్మపాలెం తీరంలో చేపల వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైన అరిజిల్లి బంగార్రాజు(17) మృతదేహం ఆదివారం ఉదయం దిబ్బపాలెం తీరానికి చేరింది. తోటి మత్స్యకారులతో కలిసి శనివారం తెల్లవారుజామున చేపలు వేటకు వెళుతున్న క్రమంలో కెరాటాల తాకిడికి బంగార్రాజు పడవ నుంచి సముద్రంలోకి జారి, గల్లంతయ్యాడు. ఉదయం నుంచి రాత్రి వరకు మృతదేహం కోసం గాలించినా ఫలితం కనిపించలేదు. ఆదివారం ఉదయానికి మృతదేహం తీరానికి చేరింది. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న వెంటనే పరవాడ ఎస్‌ఐ బి.కృష్ణారావు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.