
‘మధ్యంతర భృతి వెంటనే ప్రకటించాలి’
ఆరిలోవ: ఉద్యోగ, ఉపాధ్యాయులకు మధ్యంతర భృతి(ఐఆర్) వెంటనే ప్రకటించాలని స్టేట్ టీచర్స్ యూనియన్(ఎస్టీయూ) జిల్లా ప్రధాన కార్యదర్శి ఇమంది పైడిరాజు ఆదివారం ఓ ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు గడిచినా ఇంత వరకు ఐఆర్ ప్రకటించలేదన్నారు. దీంతో పాటు పెండింగ్‌లో ఉన్న డీఏలు కూడా చెల్లించలేదని ఆక్షేపించారు. సాధారణ ఎన్నికల ముందు ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించి ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఇంతవరకు పీఆర్‌సీ కమిషన్ నియమించకపోవడంతో ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆవేదన చెందుతున్నట్లు పేర్కొన్నారు. ఈహెచ్‌ఎస్ కింద ప్రతి ఉద్యోగి నెలానెలా కొంత మొత్తం చెల్లిస్తున్నా.. కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రులు వైద్యం అందించేందుకు నిరాకరిస్తున్నాయని వాపోయారు. తక్షణమే ఈ సమస్యలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు.