
అనుపమకు ‘వెంపటి చిన్న సత్యం లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవా
మద్దిలపాలెం: పద్మభూషణ్ వెంపటి చిన్న సత్యం 96వ జయంతి ఉత్సవాలు మద్దిలపాలెం కళాభారతి ఆడిటోరియంలో రెండు రోజుల పాటు వైభవంగా జరిగాయి. విశాఖ ఆర్ట్స్ అండ్ డ్యాన్స్ అసోసియేషన్ , కూచిపూడి కళాక్షేత్ర సంయుక్త నిర్వహణలో ముగింపు రోజున వివిధ నృత్య ప్రదర్శనలతో కళాకారులు నృత్య నీరాజనం పలికారు. కార్యక్రమాన్ని నగర పోలీసు కమిషనర్ డా. శంఖబ్రత బాగ్చి, డాక్టర్ శ్రీధర్ మిత్ర, బ్రహ్మకుమారీస్ విశ్వవిద్యాలయం ఇన్‌చార్జి రమ, గురు హరి రామమూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ కూచిపూడి ప్రదర్శకురాలు అనుపమ మోహన్‌కు ‘వెంపటి చిన్న సత్యం లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు’ ప్రధానం చేశారు. హైదరాబాద్‌కు చెందిన శ్రియ శ్రీరామ్ (భరతనాట్యం), విశాఖకు చెందిన కళాకారులు కథక్, ఒడిస్సీ నృత్యాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రతి ఏటా ఇద్దరికి రూ. 5,000 నగదుతో కూడిన మెరిట్ స్కాలర్‌షిప్‌ను ప్రవేశపెట్టినట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈఏడాది శ్రీ భారతీయ కళాసదన్ విద్యార్థిని కుమారి ఆకెళ్ళ రవళి మనోహరణిని ఎంపిక చేశారు. వీవీడీఏ ప్రధాన కార్యదర్శి కన్నం వెంకటరమణ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈవేడుకలకు ఫెస్టివల్ కోఆర్డినేటర్స్ మంజుష ,సింధుజ, మహాలక్ష్మి ,కల్యాణి, గోపీనాథ్‌లు వ్యవహరించారు.