
విశాఖ దశ దిశ మారేలా అభివృద్ధి ప్రణాళికలు
అధికారుల సమావేశంలో మంత్రి లోకేష్
మహారాణిపేట: రానున్న 30 ఏళ్ల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని విశాఖ దశ దిశ మారేలా అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలని రాష్ట్ర మానవ వనరులు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ అధికారులను, ప్రజాప్రతినిధులను ఆదేశించారు. ఆదివారం కలెక్టరేట్ హాలులో ఉత్తరాంధ్ర జిల్లాల (విశాఖ, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం) అధికారులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆ వివరాలను విలేకరుల సమావేశంలో మంత్రి లోకేశ్ వివరించారు. బెంగళూరు, పుణె వంటి నగరాల్లో ట్రాఫిక్ సమస్యలు ఇక్కడ ఉత్పన్నం కాకుండా రోడ్లను అభివృద్ధి చేయాలని సూచించారు. విశాఖ వేదికగా అనేక కంపెనీలు వస్తున్నందున, దానికి తగ్గట్టుగా మాస్టర్ ప్లాన్లు సిద్ధం చేయాలన్నారు. ఈ రీజియన్‌లో యువతకు 5 లక్షల ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. అలాగే ఐటీ పార్కుల ఏర్పాటుకు అనువైన ల్యాండ్ బ్యాంక్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. విశాఖ ఆంధ్రప్రదేశ్‌కు ఆర్థిక రాజధాని అని పేర్కొన్న లోకేశ్, హైదరాబాద్ 30 ఏళ్లు పడితే.. విశాఖ కేవలం పదేళ్లలో అభివృద్ధి చెందుతుందని ధీమా వ్యక్తం చేశారు. 2047 నాటికి జీవీఎంసీ ఆర్థిక పరపతిని ఒక ట్రిలియన్ డాలర్లకు చేరుస్తామని లక్ష్యాన్ని ప్రకటించారు. ఈ సమావేశంలో ఐటీ సెక్రటరీ, మేయర్, ఎమ్మెల్యేలు, నాలుగు జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.