‘శ్రద్ధ’తో నిరాశ్రయులకు రక్ష | - | Sakshi
Sakshi News home page

‘శ్రద్ధ’తో నిరాశ్రయులకు రక్ష

Oct 10 2025 7:58 AM | Updated on Oct 10 2025 7:58 AM

‘శ్రద

‘శ్రద్ధ’తో నిరాశ్రయులకు రక్ష

● నిరాశ్రయుల బాగోగులే లక్ష్యంగా తపన ● దేశ వ్యాప్తంగా ఎందరో ఇళ్లలో వెలుగు నింపిన సంస్థ ● నేడు ప్రపంచ నిరాశ్రయుల దినోత్సవం

అల్లిపురం: దేశవ్యాప్తంగా అనాథలు, నిరాశ్రయులు, మానసిక వికలాంగులు, వృద్ధులు రోడ్లపై నిత్యం ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లు, సరైన దుస్తులు లేక దీన స్థితిలో తిరిగే ఇలాంటి వారికి సహాయం అందించేందుకు జీవీఎంసీ సహకారంతో ఏయూటీడీ సంస్థ నగరంలో పలుచోట్ల నిరాశ్రయ వసతి గృహాలను నిర్వహిస్తోంది. ఈ వసతి గృహాల్లో నిరాశ్రయుల కోసం ఆహారం అందించడంతో పాటు, చికిత్స వరకు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు.

మానసిక వికలాంగులకు ప్రత్యేక చికిత్స

సామాజిక సేవా రంగంలో మెరుగైన సేవలు అందిస్తున్న ఏయూటీడీ.. నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించడంతో పాటు మానసిక వికలాంగులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌, రైల్వే స్టేషన్‌ ప్రాంతాల్లో దీనస్థితిలో, మలమూత్రాలతో తడిసిపోయి తిరిగే ఇలాంటి వారి గురించి సమాచారం అందిన వెంటనే ఏయూటీడీ సిబ్బంది స్పందిస్తారు. వారికి అక్కడికక్కడే సపర్యలు చేసి, బట్టలు మార్చి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుంటారు. వీరికి ప్రత్యేకంగా మానసిక చికిత్సాలయంలో చికిత్స అందించడంతో పాటు, ప్రముఖ సంస్థ శ్రద్ధ ఫౌండేషన్‌ ద్వారా ప్రత్యేక మెడికేషన్‌ అందించి వారిని సాధారణ మనుషులుగా తీర్చిదిద్దుతున్నారు.

పోలీస్‌ కమిషనర్‌ సహకారంతో ‘మిషన్‌ జ్యోతిర్గమయ’

నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ శంఖబ్రత బాగ్చి సహకారంతో ఇటీవల విశాఖలో ‘మిషన్‌ జ్యోతిర్గమయ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు 270 మంది నిరాశ్రయులను గుర్తించి, ఏయూటీడీ వసతి గృహంలో ఆశ్రయం కల్పించారు. వారిలో మానసికంగా బాధపడుతున్న వారికి శ్రద్ధ ఫౌండేషన్‌ ద్వారా మందులు వాడించడంతో ఆరోగ్యం మెరుగుపడిన అనంతరం వారి వివరాలు సేకరించి కుటుంబ సభ్యులకు అప్పగించే కార్యక్రమాన్ని శ్రద్ధ ఫౌండేషన్‌, ఏయూటీడీ సంయుక్తంగా చేపట్టాయి. పూణేకు చెందిన శ్రద్ధ ఫౌండేషన్‌కు దేశవ్యాప్తంగా పెద్ద నెట్‌వర్క్‌ ఉంది. దాని సహాయంతో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన నిరాశ్రయులను వారి కుటుంబ సభ్యులకు అప్పగించిన ఘటనలు కోకొల్లలు. సంవత్సరాలు గడిచిపోయి, ఇంక చనిపోయారని అనుకున్న వారు కూడా కుటుంబ సభ్యుల చెంతకు చేరి ఆశ్చర్యపరిచిన సందర్భాలు అనేకం. ఈ సంస్థల సేవలతో అనేక కుటుంబాల్లో తిరిగి ఆనందం నిండుతోంది.

టీఎస్‌ఆర్‌ కాంప్లక్స్‌ పురుషుల నిరాశ్రయ వసతి గృహంలో ఆశ్రయం పొందుతున్న నిరాశ్రయులు

టీఎస్‌ఆర్‌ కాంప్లెక్స్‌లో పంక్తి భోజనాలు చేస్తున్న మహిళలు, పురుషులు

మానసిక వ్యాధితో కటుంబాన్ని కోల్పోయాను

మానసిక వ్యాధితో నా కుటుంబాన్ని కోల్పోయాను. వ్యాధితో బాధపడుతూ దిక్కుతోచకుండా రోడ్డునపడ్డాను.. నన్ను ఏయూటీడీ సిబ్బంది అక్కున చేర్చుకుని చికిత్స అందజేశారు. ఇప్పుడు నా ఆరోగ్యం బాగుపడింది. ఇప్పుడు ఇక్కడే చిన్న చిన్న పనులు చేసుకుంటున్నాను.

– బి.వీరేశలింగం, నిరాశ్రయుడు

ఏయూటీడీ – శ్రద్ధ భాగస్వామ్యానికి ఏడాది పూర్తి

ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న అసోసియేషన్‌ ఫర్‌ అర్బన్‌ అండ్‌ ట్రైబల్‌ డెవలప్మెంట్‌ (ఏయుటీడీ), శ్రద్ధ రిహాబిలిటేషన్‌ ఫౌండేషన్‌, ముంబై మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం ఏడాది గడిచింది. ఏడాది కాలంలో, భారతదేశం వ్యాప్తంగా సంచరించే మానసిక వ్యాధిగ్రస్త నిరాశ్రయులను చికిత్స చేసి, కోలుకున్న తర్వాత 94 మందిని వారి కుటుంబాలతో మళ్లీ కలిపారు. వీరిలో ఒక తల్లి–పిల్ల జంట కూడా ఉంది, ఇప్పటి వరకు కుటుంబాలతో కలసిన వారు 36 మంది (22 పురుషులు, 14 మహిళలు, 1 చిన్నారి). ఏయుటీడీ నుండి మహారాష్ట్రలోని శ్రద్ధ కర్జట్‌, నాగ్‌పూర్‌ కేంద్రాలకు తరలించి, అక్కడ చికిత్స అనంతరం కుటుంబాలతో మళ్లీ కలిసిన వారు 58 మంది (47 పురుషులు, 11 మహిళలు). స్థానిక వైద్యులు, సంస్థలలో డాక్టర్‌ సత్వ వంశీ, వరుణ్‌ ల్యాబ్‌, గాయత్రి విద్యా పరిషత్‌ మెడికల్‌ కాలేజ్‌, స్నేహ సంద్య ఏజ్‌ కేర్‌ ఫౌండేషన్‌ వంటి వారు కూడా తమ సేవలు, సహకారాలు అందించారు. నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ శంఖబ్రత బాగ్చి సహకారంతో మరింత మందిని వారి కుటుంబ సభ్యుల చెంతకు చేర్చగలిగాం. ఏయుటీడీ కార్యదర్శి ప్రగడ వాసుతో కలసి శ్రద్ధ ఫౌండేషన్‌ పరిచేయడం ఆనందంగా ఉంది.

– డాక్టర్‌ భారత్‌ వట్వాని (ఎమ్‌డీ సైకియాట్రీ), సంస్థాపక ట్రస్టీ – శ్రద్ధ రిహాబిలిటేషన్‌ ఫౌండేషన్‌

ఇప్పటి వరకు 309 మందిని రెస్క్యూ చేశాం

2013 నుంచి ఇప్పటి వరకు 309 మందిని రెస్య్కూ చేశాం. అందులో 94 మహిళలు, 209 మంది పురుషులను వారి వారి సొంత రాష్ట్రాలకు పంపగలిగాం. పూణేలోని శ్రద్ధ ఫౌండేషన్‌ ద్వారా అప్పగించగలిగాం. ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీ గతంలో మానవతా దృక్ఫథంతో వారికి రక్షించాలని, రెస్క్యూ చేయాలని ఆర్డర్స్‌ పాస్‌ చేశారు. కాని వాటిని ఇప్పుడు అమలు చేయని పరిస్థితి. దీనిపై ప్రభుత్వం పునరాలోచించాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వం సకాలంలో స్పందించి సహకారం అందజేస్తే మరిన్ని సేవలు అందించగలం.

– ప్రగడ వాసు, ఏయుటీడీ కార్యదర్శి

రెండేళ్లుగా ఆశ్రయం కల్పించారు

నాది తమిళనాడు. నా అన్నవారు ఎవరూ లేరు. మానసికంగా బాలేక దారితప్పి విశాఖ రైల్వే స్టేషన్‌కు వచ్చేశా. ఏడీటీడీ వారు రక్షించి చికిత్స చేయించారు.. రెండేళ్లుగా జీవీఎంసీ, ఏయూటీడీ నిరాశ్రయ వసతి గృహంలో ఆశ్రయం కల్పించారు. అన్ని రకాల వసతులు అందుతున్నాయి.

– జి.హేమానంద్‌, తమిళనాడు

‘శ్రద్ధ’తో నిరాశ్రయులకు రక్ష1
1/1

‘శ్రద్ధ’తో నిరాశ్రయులకు రక్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement