
మీ సంకల్పానికి సలాం
దివ్యాంగుల చేతిలో రూపుదిద్దుకున్న దీపావళి ప్రమిదలు
సీతంపేట: వైకల్యం.. శారీరకమైనా, మానసికమైనా కుంగిపోవాల్సిన పనిలేదు. ఇది తలరాత అని చింతించాల్సిన అవసరం అంతకంటే లేదు. చీకట్లను చీల్చుకుని వచ్చే కాంతి రేఖలా జీవితంలో ఎదగవచ్చని ఆ చిన్నారులు నిరూపిస్తున్నారు. ఓ వైపు అక్షరాలు దిద్దుతూనే మరోవైపు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. తమ భవితకు బాటలు వేసుకుంటూ.. జీవితం వికసించేలా ప్రయత్నిస్తున్నారు. గెలుపు బాటలో పయనించేందుకు ఓర్పుతో ముందుకు సాగుతున్నారు. చిట్టి చేతులతో దీపావళికి రంగురంగుల ప్రమిదలను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. ఎంతో ఓపికతో నైపుణ్యత సాధించిన వారి సంకల్పానికి ఎవరైనా సలామ్ కొట్టాల్సిందే. మా విద్యార్థులు దివ్యాంగులు కాదు.. ప్రత్యేక సామర్థ్యం కలిగిన చిన్నారులు అంటూ వారి జీవితాన్ని రంగులమయం చేస్తోంది ప్రజ్వల్ వాణి వెల్ఫేర్ సొసైటీ.
అక్కయ్యపాలెం జగన్నాథపురంలో గల ప్రజ్వల్ వాణి వెల్ఫేర్ సొసైటీలో శిక్షణ పొందుతున్న దివ్యాంగ పిల్లలు అద్భుతమైన ప్రమిదలు తయారు చేసి అందరినీ ఆకట్టుకున్నారు. ‘ఖుషీ దీప్’ ప్రాజెక్టులో భాగంగా, చిన్నారులు మట్టి ప్రమిదలకు ఎరుపు, ఆకుపచ్చ, నీలం వంటి రంగులు అద్ది, కుందన్స్ అంటించి వాటిని ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా సొసైటీ వ్యవస్థాపకురాలు జేవీఎల్ సుచిత్ర మాట్లాడుతూ దివ్యాంగ పిల్లల్లో ఆత్మవిశ్వాసం, నైపుణ్యాలు పెంపొందించేలా ప్రతి ఏటా దీపావళి ప్రమిదలను వారి చేత తయారు చేయిస్తున్నట్టు తెలిపారు. తయారు చేసిన ఈ ప్రమిదలను నగరంలోని కళాశాలలు, పాఠశాలలు, మాల్స్, బీచ్‌రోడ్, గేటెడ్ కమ్యూనిటీలలో ప్రదర్శించి, పిల్లల చేత విక్రయిస్తామన్నారు. ఇలా విక్రయించడం ద్వారా చిన్నారులలో సేల్స్ నైపుణ్యాలు, వృత్తిపరమైన శిక్షణ, స్వావలంబన పెంపొందుతాయని ఆమె వివరించారు.

మీ సంకల్పానికి సలాం

మీ సంకల్పానికి సలాం

మీ సంకల్పానికి సలాం