
ఏసీఎఫ్‌ఐ ఏపీ చాప్టర్ చైర్మన్‌గా సాంబశివరావు
సాక్షి, విశాఖపట్నం : ఎయిర్ కార్గో ఫోరం ఇండియా(ఏసీఎఫ్‌ఐ) ఆంధ్రప్రదేశ్ చాప్టర్ చైర్మన్‌గా జి.సాంబశివరావు ఎన్నికయ్యారు. ఈ మేరకు ఏసీఎఫ్‌ఐ ప్రధాన కార్యాలయం శుక్రవారం ప్రకటించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీలో ప్రస్తుతం విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయాలు ఎగుమతి దిగుమతుల్లో కార్గో కార్యకలాపాలకు అపారమైన అవకాశాలు కల్పిస్తున్నాయన్నారు. ముఖ్యంగా ఫార్మా ఉత్పత్తులు, సముద్ర ఉత్పత్తులు (రొయ్యలు, చేపలు), పూలు, మొక్కలు, పరిశ్రమలు, నౌకా స్పేర్స్ వంటి వస్తువుల ఎగుమతితో పాటు బంగారం, వెండి, వజ్రాలు వంటి వస్తువుల దిగుమతులు విస్తృతంగా జరుగుతున్నాయన్నారు. వీటి ద్వారా రాష్ట్ర ఆర్థిక కార్యకలాపాలు పెరగడంతో పాటు స్థానిక యువతకు, మహిళలకు, లాజిస్టిక్స్ రంగంలో ఉపాధి అవకాశాలు ఏర్పడేందుకు కృషి చేస్తాన న్నారు. ఏపీలో ఎయిర్ కార్గో కనెక్టివిటీ మెరుగుపడితే, ఇది పరిశ్రమలు, ఎంఎస్‌ఎంఈలు, స్టార్టప్‌లకు ఉపయోగకరంగా ఉంటుందని, ఉత్తరాంధ్ర జిల్లాలకు అవకాశాలు కలుగుతాయన్నారు.