
మనవడు మహా ముదురు
కంచరపాలెంలో దోపిడీ
ఇంటి దొంగ పనే..
క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తలదన్నేలా స్కెచ్ వేసిన కృష్ణకాంత్
ఇంటి దొంగతో పాటు సహకరించిన ముగ్గురు స్నేహితుల అరెస్ట్
రూ.2.1 లక్షలు, 12 తులాల బంగారం ఆభరణాలు, కారు స్వాధీనం
విశాఖ సిటీ : క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మించిన దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. కంచరపాలెంలో బామ్మ, మనవడిని కట్టేసి.. బంగారం, నగలు దోచుకున్నది ఇంటి దొంగే అని గుర్తించారు. ఈ దోపిడీలో మాస్టర్ మైండ్ మనవడే అన్నదే ఇక్కడ అసలు ట్విస్ట్. అప్పుల ఊబి నుంచి బయటపడేందుకు థ్రిల్లర్ సినిమాను తలదన్నెలా ముగ్గురి స్నేహితులతో కలిసి సొంతింట్లోనే దోపిడీకి పక్కాగా ప్లాన్ చేసి బంగారు ఆభరణాలు, నగదు దోచేశాడు. సాంకేతికత ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేయగా అసలు విషయాన్ని తెలుసుకుని షాక్‌కు గురయ్యారు. తన సొంత ఇంటికే కన్నం వేసిన కృష్ణకాంత్ (19)తో పాటు అతని ముగ్గురు స్నేహితులు పరపతి ప్రమోద్ కుమార్ (30), షేక్ అభిషేక్ (21), అవసరాల సత్యసూర్యకుమార్ (24)లను అరెస్టు చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు. శుక్రవారం పోలీస్ కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన కేసు వివరాలను వెల్లడించారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం..
జీవీఎంసీలో కాంట్రాక్టు పనులు చేసే ఆనంద్‌రెడ్డి కుటుంబంతో కలిసి కంచరపాలెంలో ఇంద్రానగర్ 5వ వీధిలో నివాసముంటున్నాడు. ఇతడు ఈ నెల 4వ తేదీన శుభకార్యం కోసం హైదరాబాద్‌కు వెళ్లాడు. 5వ తేదీ రాత్రి సుమారు 12.30 గంటలకు గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు ఇంటి వెనుక తలుపు పగలగొట్టి లోనికి ప్రవేశించారు. ఆ సమయంలో ఇంట్లో ఆనంద్‌రెడ్డి తల్లితో పాటు కుమారుడు ధర్మాల కృష్ణకాంత్ నిద్రలో ఉన్నారు. ఆ అగంతకులు బామ్మ, మనవుడ్ని ప్లాస్టర్, ప్లాస్టిక్ ట్యాగ్ వైర్లతో కట్టేసి నిర్బంధించారు. ఆమె ఒంటిపై ఉన్న 12 తులాల బంగారు ఆభరణాలు, మనవడి చేతికి ఉన్న డైమండ్ రింగ్, బీరువాలో ఉన్న రూ. 50 వేలు దోచుకున్నారు. తర్వాత ఇంటి ముందు పార్క్ చేసిన మహీంద్ర ఎక్స్‌యూవీ వాహనాన్ని కూడా దొంగలించి అక్కడ నుంచి పరారయ్యారు.
నిందితులను చాకచక్యంగా
పట్టుకున్న పోలీసులు
కేసు దర్యాప్తు కోసం నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు డిప్యూటీ కమిషనర్ (క్రైమ్స్) లతా మాధురి ఆధ్వర్యంలో ఇన్‌చార్జ్ క్రైమ్ ఏసీపీ అన్నెపు నరసింహమూర్తి పర్యవేక్షణలో వెస్ట్ క్రైమ్ సీఐ మీసాల చంద్రమౌళి, ఎస్‌ఐ షేక్ అబ్దుల్ మరూఫ్, సీసీఎస్ సిబ్బందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. నిందితుల కోసం ఒకవైపు నగరంలో గాలిస్తూనే మరోవైపు వారి మొబైల్ డేటాలో అనుమానాస్పద యాప్‌లు, ట్రేడింగ్‌కు సంబంధించిన హిస్టరీ, ప్లాస్టర్ సెర్చ్ హిస్టరీ వంటి ఆధారాలను గుర్తించారు. దీంతో పోలీసులు నిందితుల కోసం విజయవాడ, హైదరాబాద్‌లలో గాలించారు. పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో నిందితులు తిరిగి విశాఖకు వచ్చి బంగారం, నగదు పంచుకుంటుండగా పోలీసులు వారిని పట్టుకున్నారు. వారి నుంచి రూ.2.1 లక్షలు, 12 తులాల బంగారు ఆభరణాలు, మహీంద్రా కారును స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు.
థ్రిల్లర్ సినిమా స్టైల్‌లో...
ప్రధాన నిందితుడు కృష్ణకాంత్ తండ్రి ఆనంద్‌రెడ్డిలా వ్యాపారంలో సక్సస్ అవ్వాలని ఆన్‌లైన్ ట్రేడింగ్ చేశాడు. ఇందులో భారీగా నష్టపోయాడు. అప్పులు తీర్చేందుకు స్నేహితులు పీఎం పాలెంకు చెందిన పరపతి ప్రమోద్ కుమార్, కేఆర్‌ఎం కాలనీకి చెందిన షేక్ అభిషేక్, మధురవాడకు చెందిన అవసరాల సత్య సూర్యకుమార్‌లతో కలిసి సొంత ఇంట్లోనే దొంగతనం చేయాలని ప్రణాళిక చేశాడు. వారం రోజుల ముందు వీరు సెల్ కాన్ఫరెన్స్‌లో నేరానికి ఏం ఉపయోగించాలి.. ఎలా తప్పించుకోవాలో ప్లాన్ చేశారు. ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలు కూడా పని చెయ్యకపోవడంతో ఆ విషయం కూడా మాట్లాడుకుని నేరం చేస్తున్న సమయంలో హిందీ తప్ప మరే భాష మాట్లాడకూడదని నిర్ణయించుకున్నారు. ఈ సమయంలో కృష్ణకాంత్ తండ్రి ఆనంద్‌రెడ్డి హైదరాబాద్‌కు వెళ్లడంతో వీరు ఈ నెల 5వ తేదీ రాత్రికి ప్లాన్ అమలు చేయాలని నిర్ణయించుకున్నారు. అనుకున్న విధంగా బామ్మతో పాటు కృష్ణకాంత్‌ను కట్టేసి బంగారం, నగదు దోచుకున్నారు. అనంతరం ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న ఆనంద్‌రెడ్డి కార్‌లో పరారయ్యారు. అక్కడి నుంచి ఎన్‌ఏడీ, గోపాలపట్నం, ప్రహ్లాదపురం, అడవివరం, హనుమంతవాక వైపు నుంచి మారికవలస వెళ్లి అక్కడ నిర్మానుష్య ప్రాంతంలో రోడ్డు పక్కన కారు వదిలి ఆటో ద్వారా ఆర్టీసీ కాంప్లెక్స్‌కు వచ్చారు. బస్సులో ముందు విజయవాడ, అక్కడి నుంచి హైదరాబాద్ పారిపోయారు.