
రిచా ఘోష్ మెరుపులు
టీం ఇండియాపై దక్షిణాఫ్రికా విజయం
మొదట టీం ఇండియాబ్యాటర్ రిచా ఘోష్ మెరుపులు
ఒంటి చెత్తో భారీ లక్ష్యాన్ని ఛేదించిన సఫారీ బ్యాటర్ నాడిన్ డి క్లర్క్
విశాఖ స్పోర్ట్స్ : రెండు పులులు బరిలోకి దిగితే ఎలా ఉంటుందో తెలుసా? ఒకరిపై ఒకరు పంజా విసురుకుంటే ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా? విశాఖ వేదికగా జరిగిన మహిళల క్రికెట్ మ్యాచ్‌లో టీం ఇండియా బ్యాటర్ రిచా ఘోష్, సఫారీ బ్యాటర్ నాడిన్ డి క్లర్క్ తమ ప్రదర్శనతో ఆ ప్రశ్నలకు బదులిచ్చారు. నువ్వా నేనా అన్నట్టు ఫ్లడ్‌లైట్ల వెలుగుల్లో వీరిద్దరూ పరుగుల వరద సృష్టించారు. మ్యాచ్‌కు ముందు విశాఖలో వరుణుడు కాసేపు ఆనందపు జల్లులు కురిపించాడు. దీంతో తమకు అనుకూలంగా ఉంటుందని భావించిన దక్షిణాఫ్రికా టీం టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. అనుకున్నట్టే టాప్ ఆర్డర్లు ఒక్కక్కరిగా పెవిలియన్‌కు చేరుకున్నారు. వంద పరుగులకే టాప్ ఆర్డర్ కుప్పకూలిపోయింది.
ఇలాంటి సమయంలో రిచా ఘోష్ సివాంగిలా విరిచుకుపడింది. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. అంతవరకు పట్టు బిగించామన్న దక్షిణాఫ్రికాకు చెమటలు పట్టించింది. 11 ఫోర్లు, మూడు భారీ సిక్సర్లతో 94 పరుగులు సాధించింది. ఆఖరి ఓవర్ భారీ సిక్స్‌కు ప్రయత్నించి దురదృష్టవశాత్తూ క్యాచ్‌ఔట్‌గా వెనుతిరిగింది. అయితే అప్పటికే భారత్ స్కోరు 251 చేరింది.
భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో దక్షిణాఫ్రికా బ్యాటర్లు తడపడ్డారు. 81 పరుగులకే 5 కీలక వికెట్లు చేజార్చుకున్నారు. ఈ క్రమంలో భారత్ విజయం నల్లేరుమీద నడకే అనున్నారంతా... కానీ అప్పుడు సివంగిలా నాడిన్ డి క్లర్క్ ఎదురుదాడికి దిగింది. ఒంటి చేత్తో భారీ లక్ష్యాన్ని ఉఫ్ అని ఊదేసింది. కేవలం 54 బంతుల్లో 84 పరుగులు చేసింది. ఇందులో 8 ఫోర్లు, 5 భారీ సిక్సర్లు ఉన్నాయి. చివరి ఓవర్లలో ఆకాశమే హద్దుగా సిక్సర్ల వర్షం కురిపించడంతో సఫారీల విజయ సంబరాలు అంబరాన్నంటాయి.

నాడిన్ డి క్లర్క్ ఎదురుదాడి