
సీటు దొరికేదెలా?..
కిటకిటలాడుతున్న రైళ్లు.. జనసంద్రంగా విశాఖ స్టేషన్
తాటిచెట్లపాలెం: దసరా పండగ సందర్భంగా విశాఖ నుంచి తమ సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. ఉద్యోగులు, విద్యార్థులు, కార్మికులు తమ కుటుంబ సభ్యులతో కలిసి పండగ జరుపుకోవడానికి సొంత ప్రాంతాలకు పయనమవుతున్నారు. దీంతో రెండు రోజులుగా విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో తీవ్ర రద్దీ నెలకొంది. విశాఖ నుంచి విజయవాడ, హైదరాబాద్, తిరుపతి, చైన్నె, బెంగళూరు వంటి ప్రధాన నగరాలతో పాటు, ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పలాస వైపు వెళ్లే రైళ్లు ప్రయాణికులతో నిండిపోతున్నాయి. దాదాపు అన్ని రైళ్లలో రిజర్వేషన్లు ముందే పూర్తికావడంతో, చివరి నిమిషంలో ప్రయాణాలు పెట్టుకున్న వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలా రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ వందల్లో ఉండటంతో, టికెట్లు కన్ఫర్మ్ కాని ప్రయాణికులు జనరల్ బోగీలను ఆశ్రయిస్తున్నారు. దీంతో జనరల్ బోగీల్లో కాలు మోపడానికి కూడా స్థలం లేని పరిస్థితి నెలకొంది. ప్రయాణికులు గంటల తరబడి నిలబడే ప్రయాణం చేయాల్సి వస్తోంది. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, పిల్లలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ కొన్ని ప్రత్యేక రైళ్లు ప్రకటించినప్పటికీ, అవి ఏమాత్రం సరిపోవడం లేదని ప్రయా ణికులు వాపోతున్నారు. డిమాండ్‌కు అనుగుణంగా మరిన్ని ప్రత్యేక రైళ్లు నడపాలని, ఉన్న రైళ్లకు అదనపు బోగీలు ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు.
– ఫొటోలు: సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం

సీటు దొరికేదెలా?..

సీటు దొరికేదెలా?..

సీటు దొరికేదెలా?..