
జర్నలిస్టుల సంక్షేమానికి దృష్టి సారించాలి
తాటిచెట్లపాలెం: ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, బ్రాడ్‌కాస్ట్, స్మాల్ అండ్ మీడియం న్యూస్‌పేపర్స్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో ఆదివారం టీఎస్‌ఎన్ కాలనీలోని సింకా గ్రాండ్ హోటల్‌లో జర్నలిస్టుల దసరా సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం దృష్టి సారించాలని, అందుకు తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగవరపు ఆంజనేయులు మాట్లాడుతూ జర్నలిస్టుల పట్ల ప్రభుత్వాలు శ్రద్ధ చూపకపోవడం విచారకరమన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు త్వరలో విజయవాడ వేదికగా ర్యాలీ నిర్వహిస్తామని ప్రకటించారు. జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు పి. నారాయణ్ మాట్లాడారు. నృత్యభారతి డ్యాన్స్ స్కూల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నృత్య ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కాంగ్రెస్ నాయకుడు హైదర్ ఆలీ సింకా, ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.ఈశ్వరరావు, జిల్లా కార్యదర్శి జి.శ్రీనివాసరావు, బ్రాడ్‌కాస్ట్ అధ్యక్ష, కార్యదర్శులు ఈరోతి ఈశ్వరరావు, మదన్, స్మాల్ పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్, బండారు శివప్రసాద్, పక్కి వేణుగోపాల్, నారాయణరాజు పాల్గొన్నారు.