
అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా విశాఖ
బీచ్‌రోడ్డు: డొమెస్టిక్ పర్యాటకంతో పాటు, అంతర్జాతీయ పర్యాటకానికి విశాఖను చిరునామాగా తీర్చిదిద్దేందుకు అవిరళ కృషి చేస్తున్నామని కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ తెలిపారు. శనివారం ప్రపంచ పర్యాటక దినోత్సవంలో భాగంగా వీఎంఆర్‌డీఏ చిల్డ్రన్ ఎరీనాలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. విశాఖను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తూ, పర్యాటక రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ఇటీవల నగరంలో అందుబాటులోకి వచ్చిన కొత్త పర్యాటక ఆకర్షణలను ఆయన గుర్తు చేశారు. వీటిలో డబుల్ డెక్కర్ బస్సు, యూహెచ్3హెచ్ మ్యూజియం, యాత్రీ నివాస్ పునఃప్రారంభం వంటి నూతన ప్రాజెక్టులు ఉన్నాయని పేర్కొన్నారు. పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే విధంగా బీచ్ కారిడార్‌లో పలు రకాల వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏ, పర్యాటక శాఖ పరిధిలో అనేక అభివృద్ధి ప్రాజెక్టులు చేపడుతున్నామని, మరిన్ని హోటళ్లు, రిసార్టులు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని, దానిలో భాగంగా కొన్నింటికి భూ కేటాయింపులు కూడా జరిగాయని వివరించారు. ఉత్తరాంధ్ర, దిగువ దక్షిణాంధ్ర ప్రాంతాలను కలుపుతూ టెంపుల్ టూరిజం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. రానున్న రెండు మూడేళ్లలో పర్యాటకంగా వినూత్న ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తాయని, విశాఖ రూపురేఖలు మరింత మారిపోతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. త్వరలో భీమిలి, విశాఖ ఉత్సవ్ నిర్వహిస్తామన్నారు. వచ్చే ఫిబ్రవరిలో అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ, విశాఖ పరేడ్ నిర్వహిస్తామని, ఇటీవల జరిగిన ఫుడ్ ఫెస్టివల్ మాదిరిగా మరిన్ని కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా పర్యాటక శాఖ అధికారి జె. మాధవి, డీవీఎం జగదీశ్, వివిధ అసోసియేషన్ల ప్రతినిధులు, ఇతర అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
దసరా రద్దీ..కిక్కిరిసిన బస్సులు

అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా విశాఖ