
పవర్ స్టార్‌లో.. పవర్ లేదు
బాలకృష్ణ వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం మౌనం ఎందుకు?
సొంత అన్న కోసం కూడా ప్రశ్నించకపోతే ఇంకెవరిని ప్రశ్నిస్తారు..
వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ ధ్వజం
సాక్షి, విశాఖపట్నం: అసెంబ్లీలో సొంత అన్నయ్యపై ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మౌనం ఎందుకో చెప్పాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయ లబ్ధి కోసం పవన్ కల్యాణ్ తన నాలుకను ఎలా కావాలంటే అలా తిప్పుతారని ఎద్దేవా చేశారు. గతంలో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.. మెగాస్టార్ చిరంజీవిని ఇంటికి పిలిచి భోజనం పెట్టి ఆత్మీయతను కనబరిచినా, అవమానించారని పవన్ కల్యాణ్ తప్పుడు ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్ధి పొందారన్నారు. ఇప్పుడు అసెంబ్లీ వేదికగా బాలకృష్ణ చిరంజీవిని ఇష్టానుసారంగా మాట్లాడితే.. పవన్ మాట్లాడకపోవడం దుర్మార్గమన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని చిరంజీవి అభిమానులు సైతం బాలకృష్ణ వ్యాఖ్యలపై రగిలిపోతుంటే.. తమ్ముడు పవన్ మొద్దు నిద్ర వహించడం ఎందుకో అర్థం కావడం లేదంటూ విమర్శించారు. సినీ జీవితంలో, ఎన్నికల ముందు మీ గెలుపునకు సాయం చేసిన చిరంజీవి కోసం మాట్లాడకపోతే, మరి ఇంకెవరి కోసం మాట్లాడతారు? అంటూ ప్రశ్నించారు. చిరంజీవి ఫ్యాన్స్ సైతం ఛీత్కరించే పరిస్థితి నెలకొందన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంతో గౌరవం ఇచ్చారని చిరంజీవే స్వయంగా లేఖ ద్వారా ప్రజలకు వాస్తవాలు చెప్పారన్నారు. నటుడు, దర్శక నిర్మాత ఆర్.నారాయణమూర్తి ఈ వ్యవహారంపై స్పందిస్తూ గత ప్రభుత్వం సినిమా వాళ్లను అవమానించలేదని చెప్పారని గుర్తు చేశారు. బాలకృష్ణ లాంటి కుసంస్కారంతో కూడిన వ్యక్తులు ఎన్ని అబద్ధాలు మాట్లాడినా.. ప్రజల్లో చిరంజీవి ఎప్పటికీ మెగాస్టారే అని గుర్తు పెట్టుకోవాలన్నారు.