
మిట్టల్ స్టీల్‌కు సేవ ఆపండి
బీచ్‌రోడ్డు: కూటమి ప్రభుత్వం విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను నిర్వీర్యం చేస్తూ.. ప్రైవేట్ సంస్థ అయిన ఆర్సెలర్ మిట్టల్ సేవలో తరిస్తోందని విశాఖ జిల్లా అఖిలపక్ష కార్మిక, ప్రజాసంఘాల జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద శనివారం జేఏసీ ఆధ్వర్యంలో విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి సమీపంలో ఏర్పాటు చేయనున్న ఆర్సెలర్ మిట్టల్ ప్రైవేట్ స్టీల్ ప్లాంట్‌పై చూపిస్తున్న తపన విశాఖ స్టీల్ ప్లాంట్‌పై చూపకపోవడం ప్రజలను వంచించడమే అన్నారు. మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించాలని విశాఖ ఎంపీ శ్రీ భరత్‌తో సహా టీడీపీ ఎంపీలు కేంద్ర ఉక్కు శాఖా మంత్రిని కలవడం, ప్రజాభిప్రాయ సేకరణ ఆఘమేఘాల మీద చేపట్టడంలో ఆంత్యమేంటని ప్రశ్నించారు. విశాఖ ఉక్కుకు సొంత గనులు గురించి వీరు నోరు విప్పకపోవడం ప్రజలకు ద్రోహం చేయడమే అన్నారు. సొంతగనులు లేకుండా ఏ ఉక్కు పరిశ్రమ మనుగడ సాగించలేదని, లాభాల బాట పట్టలేదని ప్రధాని మోదీ, చంద్రబాబుకు తెలుసు అన్నారు. విశాఖ ఉక్కుకు సొంత గనులు కేటాయించే వరకు మిట్టల్ స్టీల్ ప్లాట్‌కు గనులు కేటాయించవద్దని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా జేఏసీ చైర్మన్ జగ్గు నాయుడు, విశాఖ ఉక్కు పోరాట కమిటీ చైర్మన్ మంత్రి రాజశేఖర్, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కేఎస్‌వీ కుమార్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి అచ్యుతరావు, ఐఎన్టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగభూషణం, ఇఫ్టూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం. వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.