
సమాజ అభివృద్ధికి బాలికా విద్య కీలకం
విశాఖ లీగల్: సమాజ పురోగతికి బాలికలందరూ తప్పనిసరిగా చదువుకోవాలని జిల్లా న్యాయ సేవా ప్రాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఆర్.సన్యాసినాయుడు పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలో న్యాయ సేవా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో బాల్య వివాహాలు, కౌమార వివాహాల వల్ల కలిగే నష్టాలపై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. బాల్య వివాహాల వల్ల బాలికలు ఆరోగ్య సమస్యలతో పాటు అనేక సామాజిక సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. బాలికలు కనీసం డిగ్రీ వరకు చదువుకొని, ఆ తర్వాత మాత్రమే వివాహానికి అంగీకారం తెలపాలని సూచించారు. కనీస వివాహ వయసు 21 సంవత్సరాలుగా ఉందని, చట్ట వ్యతిరేకమైన వివాహాలు చేస్తే కఠిన శిక్షలు తప్పవని న్యాయమూర్తి హెచ్చరించారు. చిన్నతనంలో బాలికలను ఇబ్బంది పెట్టి వివాహాలు చేయడం, చదువుకు దూరంగా ఉంచడం వల్ల కలిగే నష్టానికి కుటుంబంతో పాటు సమాజం మొత్తం బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె.రమాలక్ష్మి మాట్లాడుతూ బాలికలు విద్య, మానసిక, శారీరక, కుటుంబ సమస్యలకు గురైతే తక్షణమే న్యాయ సేవా ప్రాధికార సంస్థను సంప్రదించవచ్చన్నారు. విద్యా శాఖ డైరెక్టర్ మాధవి, పలు స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, పారాలీగల్ వలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.