
జైలును సందర్శించిన బోర్డు ఆఫ్ విజిటర్స్ బృందం
ఆరిలోవ: విశాఖ కేంద్ర కారాగారాన్ని శనివారం బోర్డు ఆఫ్ విజిటర్స్ బృందం సందర్శించింది. బోర్డు ఆఫ్ విజిటర్స్ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి చెన్నంశెట్టి రాజు ఆధ్వర్యంలో బృందం జైలులో పర్యటించింది. పలు బ్యారక్‌లకు వెళ్లి ఖైదీలతో మాట్లాడి, వారికి కల్పిస్తున్న సౌకర్యాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా మహిళా ఖైదీల బ్యారక్‌ను సందర్శించి, వారికి కల్పిస్తున్న సౌకర్యాల గురించి జైలు పర్యవేక్షణాధికారి ఎం. మహేష్ బాబును అడిగి తెలుసుకున్నారు. అనంతరం బోర్డు సభ్యులు కలెక్టర్ ఎం.ఎన్ హరేందిర ప్రసాద్, డిప్యూటీ పోలీస్ కమిషనర్, జిల్లా విద్యా శాఖాధికారి, జిల్లా వైద్యాధికారి, జిల్లా సాంఘిక సంక్షేమాధికారి, జిల్లా వ్యవసాయాధికారి, జిల్లా ఉపాధి కల్పాణాధికారి, జిల్లా పారిశ్రామికాధికారితో పాటు జైల్ పర్యవేక్షణ, ఉప పర్యవేక్షణాధికారులతో కలసి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జైల్ లోపల ముద్దాయిలకు అందుతున్న సౌకర్యాలు, కల్పించాల్సిన సౌకర్యాలు, జైల్ అభివృద్ధికి సంబంధించిన కార్యాచరణ గురించి చర్చించారు.