
పాలనలో డిజిటల్ ట్రాన్సఫర్మేషన్ కీలకం
లేఖలు, నివేదికల తయారీలో పెరిగిన ఏఐ వినియోగం కేంద్ర సమాచార కమిషన్ కార్యదర్శి రష్మిచౌదరి
విశాఖ సిటీ : ప్రజల కేంద్రీకృతంగా సమర్ధవంతమైన పాలన అందించడంలో డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ కీలక భూమిక పోషిస్తుందని కేంద్ర సమాచార కమిషన్ కార్యదర్శి రష్మిచౌదరి పేర్కొన్నారు. 28వ జాతీయ ఈ–గవర్నెన్స్–2025 సదస్సు రెండో రోజు నోవోటెల్ హోటల్‌లో జరిగింది. ముందుగా ‘సివిల్ సర్వీస్–డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్’ అనే అంశంపై ప్లీనరీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రష్మిచౌదరి మాట్లాడుతూ ప్రభుత్వ పాలసీ విధానాల రూపకల్పన నుంచి పట్టణ ప్రణాళిక, వరద పర్యవేక్షణలో అనేక డిజిటల్ ప్లాట్‌ఫారాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని వెల్లడించారు. లేఖలు, నివేదికల తయారీలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పెరిగిందని వివరించారు. రాష్ట్ర పన్నుల చీఫ్ కమిషనర్ బాబు.ఎ మాట్లాడుతూ విధానాల తయారీ, అమలు, వ్యవస్థల నడిపించే విషయంలో సివిల్ సర్వెంట్స్ పాత్రను వివరించారు. ఎన్నికల ప్రక్రియలో ఆధార్ సీడింగ్, నగదు రహిత ప్రజా పంపిణీ వ్యవస్థల అమలు, డిజిటల్ చెల్లింపుల స్వీకరణ, ప్రజా సాధికార పల్స్ సర్వే, కృష్ణా పుష్కరాల సమయంలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగాన్ని విశదీకరించారు.
2026–27 నాటికి 11 కోట్ల రైతులకు
గుర్తింపుకార్డులు
అగ్రిస్టాక్–డిజిటల్ సొల్యూషన్ ఫర్ అగ్రికల్చర్ అనే అంశంపై జరిగిన మరో ప్లీనరీలో కేంద్ర వ్యవసాయశాఖ కార్యదర్శి దేవేష్ చతుర్వేది (వర్చువల్) మాట్లాడుతూ 2026–27 నాటికి 11 కోట్ల రైతులకు డిజిటల్ గుర్తింపుకార్డులు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. డిజిటల్ క్రాప్ సర్వే ద్వారా రైతుల సమగ్ర సమాచారం, వారి ఆధార్ లింకేజ్, భూ యాజమాన్య రికార్డులు, మ్యుటేషన్లు, పంట పొలాల ఫొటోలు, జియోట్యాగ్‌లతో జాతీయ స్థాయిలో కచ్చితమైన పంటల రికార్డులను నమోదు చేయనున్నట్లు చెప్పారు.
వాట్సాప్ గవర్నెన్స్‌తో 710 సేవలు
రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ మాట్లాడుతూ జీఎస్‌డబ్ల్యూఎస్, రియల్ టైమ్ గవర్నెన్స్ విభాగాలు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకమైనవన్నారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు సులభతరంగా అందించేందుకు వాట్సాప్ గవర్నెన్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. వాట్సాప్ డిజిటల్ ప్లాట్‌ఫాం ద్వారా 40కి పైగా విభాగాలకు చెందిన 710 సేవలు ప్రజలకు అందుతున్నాయన్నారు. రాష్ట్ర రియల్ టైమ్ గవర్నెన్స్ సీఈవో ప్రఖార్ జైన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సీసీటీవీ నిఘా వ్యవస్థలపై మాట్లాడారు. ప్రభుత్వం 2017లో ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్, రెడ్–లైట్ ఉల్లంఘనలను గుర్తించేందుకు 14,770 కెమెరాల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసిందన్నారు. వీటిపై పూర్తి స్థాయిలో పర్యవేక్షణ, సమన్వయం లేకపోవడంతో సవాళ్లు ఎదురవుతున్నాయని, వీటిని పరిష్కరించడానికి స్మార్ట్ పోలీసింగ్, గవర్నెన్స్ కోసం 300 అధునాతన కెమెరాలు, 38 అనలిటిక్స్ సాధనాలతో ఏఐని అనుసంధానం చేసినట్లు చెప్పారు. అనంతరం సదస్సులో చర్చించిన 11 అంశాలతో రూపొందించిన డిక్లరేషన్‌కు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.
ముగిసిన 28వ జాతీయ
ఈ–గవర్నెన్స్–2025 సదస్సు

పాలనలో డిజిటల్ ట్రాన్సఫర్మేషన్ కీలకం