
పీహెచ్‌సీ వైద్యుల సమ్మెబాట
మహారాణిపేట : తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లాలోని పట్టణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు సమ్మెకు సన్నద్ధమయ్యారు. ఈ నెల 25లోగా తమ డిమాండ్లు నెరవేర్చకపోతే 26 నుంచి సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించారు. ఈ మేరకు ఏపీ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పబ్లిక్ హెల్త్ డైరెక్టర్‌కు, డీఎంహెచ్‌వో డాక్టర్ పి.జగదీశ్వరరావుకు సమ్మె నోటీసులు అందజేశారు. చాలా మంది వైద్యులు పదోన్నతులు లేకుండానే పదవీ విరమణ చేస్తున్నారని సకాలంలో పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇన్–సర్వీస్ పీజీ కోటాను తిరిగి పునరుద్ధరించాలని, ఎస్టీ ఏరియాల్లో పనిచేస్తున్న వారికి బేసిక్ పేపై 50శాతం ట్రైబల్ అలవెన్స్ ఇవ్వాలని, చంద్రన్న సంచార చికిత్స కార్యక్రమంలో పనిచేస్తున్న వారికి రూ.5 వేల అలవెన్స్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. నేషనల్ ఇంక్రిమెంట్లను తదితర సమస్యలపై అనేక వినతిపత్రాలు సమర్పించినా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో సమ్మె తప్పడం లేదని అసోసియేషన్ నాయకులు డాక్టర్ జగదీష్ పేర్కొన్నారు.