
జియో స్పేషియల్ టెక్నాలజీ అనువర్తనాలు అపారం
మద్దిలపాలెం: ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధిని, ఆవిష్కరణలను ప్రజలు తమ జీవితంలో భాగం చేసుకోవాలని వర్కింగ్ గ్రూప్ ఐఎస్‌పీఆర్‌ఎస్ చైర్మన్ ఆచార్య ఐ.వి.మురళీకృష్ణ అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం, ఇండియన్ సొసైటీ ఆఫ్ జియోమ్యాటిక్స్ విశాఖ ప్రాంతీయ శాఖ ఆధ్వర్యంలో ‘జియోస్పేషియల్ టెక్నాలజీస్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ ఇష్యూస్’అనే అంశంపై శనివారం ఒక్క రోజు వర్క్‌షాపు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జియోస్పేషియల్ టెక్నాలజీస్ అనువర్తనాలు అపారమని, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల సంఖ్య పెరిగితే మేక్ ఇన్ ఇండియా కల సాకారమవుతుందన్నారు. విద్యార్థులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, డీప్ టెక్నాలజీలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఏయూ ఉపకులపతి ఆచార్య జి.పి.రాజశేఖర్ మాట్లాడుతూ జియోస్పేషియల్ రంగంలో ఏయూ చేస్తున్న కృషికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తోందని తెలిపారు. దీనికి నిదర్శనంగా విశ్వవిద్యాలయానికి లభించిన ‘టెస్ట్ యూనివర్సిటీ అవార్డు’, ఆచార్య వజీర్ మహమ్మద్‌కు లభించిన ‘నేషనల్ జియోస్పేషియల్ ఫ్యాకల్టీ అవార్డు’లను ప్రస్తావించారు. జియోస్పేషియల్ స్టూడెంట్ క్లబ్ ఏర్పాటు చేయాలని, ప్రాజెక్టులకు విశ్వవిద్యాలయం పూర్తి సహకారం అందిస్తుందని చెప్పారు. సదస్సు కన్వీనర్ ఆచార్య వజీర్ మహమ్మద్, విభాగాధిపతి ఆచార్య సి.ఎన్.వి. సత్యనారాయణరెడ్డి వర్క్‌షాప్ ప్రాముఖ్యత, విద్యార్థుల భాగస్వామ్యం గురించి వివరించారు.
ఐఎస్‌పీఆర్‌ఎస్ చైర్మన్ ఆచార్య మురళీకృష్ణ