
‘చలో పాడేరు మెడికల్ కాలేజ్’ను జయప్రదం చేయండి
సాక్షి, విశాఖపట్నం: పీపీపీ పద్ధతిలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను, భూములను కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టేందుకు చంద్రబాబు సర్కార్ కుయుక్తులు పన్నుతోందని వైఎస్సార్ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మండిపడ్డారు. రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పూర్తయిన, నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ పేరిట అతి పెద్ద స్కాంకు చంద్రబాబు పాల్పడుతున్నారని ఆక్షేపించారు.
దీన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 19న వైఎస్సార్ సీపీ విద్యార్థి, యువజన విభాగాల అధ్వర్యంలో ‘చలో మెడికల్ కాలేజ్’పేరిట నిర్వహించే నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో ‘చలో మెడికల్ కాలేజ్‘పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఒక్క మెడికల్ కాలేజ్ కూడా తీసుకురాలేదని, వైఎస్ జగన్ తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పాలనుకోవడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. మారుమూల గిరిజన ప్రాంతంలో మెడికల్ కాలేజ్ తీసుకురావడం వైఎస్ జగన్ సంస్కరణలకు ఒక గొప్ప నిదర్శనమన్నారు. మెడికల్ కాలేజీలు అంటే ఒక మెడికల్ విద్య మాత్రమే కాదని అక్కడ వైద్యం కూడా అందుబాటులోకి వస్తుందన్నారు. 2019 నుంచి 2024 వరకు వైఎస్ జగన్ హయాంలో రెండేళ్ల పాటు కరోనాలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారన్నారు. సమావేశంలో తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త మొల్లి అప్పారావు, యువజన విభాగం జోనల్ అధ్యక్షుడు అంబటి శైలేష్, జిల్లా అనుబంధ విభాగం అధ్యక్షులు పేడాడ రమణికుమారి, కర్రి రామిరెడ్డి, పులగా కొండారెడ్డి, బోని శివరామకృష్ణ, దేవరకొండ మార్కండేయులు, మాజీ చైర్మన్ అల్లంపల్లి రాజబాబు, జిల్లా విద్యార్ధి విభాగం ఉపాధ్యక్షుడు జాడ శ్రావణ్‌కుమార్, యువజన, విద్యార్థి విభాగాల నియోజకవర్గ అధ్యక్షులు కాగితాల రవికిరణ్, తాడి రవితేజ, మువ్వల సంతోష్‌కుమార్, పాల రమణిరెడ్డి, లక్ష్మణ, కార్తీక్, నితాష్, రాష్ట్ర, జిల్లా అనుబంధ కమిటీ సభ్యులు శ్రీదేవివర్మ, నాగమణి, బొట్ట రాజు, పార్టీ ముఖ్య నాయుకులు సునీల్, గీత రెడ్డి, బద్రి తదితరలు పాల్గొన్నారు.
పోస్టర్‌ను ఆవిష్కరించిన వైఎస్సార్ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు