
రోడ్డున పడిన 50 కుటుంబాలు
తాటిచెట్లపాలెం: నరసింహనగర్ రైతుబజార్ వద్ద 30 ఏళ్లుగా చిరు వ్యాపారాలు సాగిస్తున్న 50 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. గురువారం ఉదయం జీవీఎంసీ అధికారులు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా తొలగించి జీవనోపాధిని దెబ్బతీశారు. జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు, సచివాలయాల సిబ్బంది ఉదయాన్నే ఇక్కడకు చేరుకొని పొక్లెయినర్లతో బడ్డీలను, వస్తువులను విరగ్గొట్టి మరీ లారీల్లోకి ఎక్కించారు. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో చిరు వ్యాపారులు రోడ్డెక్కి ఆవేదన వ్యక్తం చేశారు. నమ్మి ఓట్లేసి గెలిపించినందుకు కూటమి ప్రభుత్వం తమకు మంచి శాస్తి చేసిందని చిరు వ్యాపారులంతా వాపోతున్నారు. తమకు ప్రత్యామ్నాయం చూపకుండా.. బడ్డీలను తొలగించడంతో జీవనోపాధి కోల్పోయామని, ఎలా బతకాలని విలపించారు.
జీవనాధారాన్ని తొలగించారు
ఉదయం నుంచి మామీద ముప్పేట దాడి చేసి జీవనాధారాన్ని తొలగించారు. సుమారు 30 ఏళ్ల నుంచి ఈ ప్రాంతంలో వ్యాపారం చేసుకున్న వారిని రోడ్డున పడేశారు. కనీసం సమయం కూడా ఇవ్వలేదు. ప్రత్యామ్నాయం చూపాలి కదా. ఇప్పుడు ఎలా బతకాలి.
– ప్రకాష్, చిరు వ్యాపారుల ప్రతినిధి, నరసింహనగర్ రైతుబజార్
ఇది పేదలను వేధించే ప్రభుత్వం
గత 20 ఏళ్లుగా ఇక్కడే పండ్ల వ్యాపారం చేసుకుంటున్నాం. ఇప్పటికిప్పుడు ఇలా తీసేస్తే ఎలా? కనీసం సమయం ఇవ్వాలి కదా? ఇప్పుడు వ్యాపారం కోసం చేసిన ఫైనాన్స్‌లు కట్టుకోవాలి? పిల్లల ఫీజులు కట్టుకోవాలి? ఇది పేదలను వేధించే ప్రభుత్వం. – సంతోష్, పండ్ల వ్యాపారి, నరసింహనగర్
చావే శరణ్యం
గత కొన్నేళ్లుగా రైతుబజార్ పరిసర ప్రాంతంలో బ్యాంగిల్స్, ఫ్యాన్సీ వ్యాపారం పాత తోపుడుబండిపై చేసుకుంటున్నాను. ఉన్నట్టుండి ఈ రోజు మా వ్యాపారాల్ని తొలగించారు. ఎలా బతకాలి. మాకు చావే శరణ్యం. ప్రభుత్వం న్యాయం చేయకపోతే ఏ విషమో తాగి చస్తాం. – రమణమ్మ, ఫ్యాన్సి, బేంగిల్స్ వ్యాపారి, నరసింహనగర్

రోడ్డున పడిన 50 కుటుంబాలు

రోడ్డున పడిన 50 కుటుంబాలు