
పచ్చని భీమిలి లక్ష్యంగా..
డ్రోన్లతో విత్తనాలు చల్లిన ‘మిషన్ గ్రీన్ భీమిలి’
భీమునిపట్నం: మిషన్ గ్రీన్ భీమిలి సంస్థ ఆధ్వర్యంలో భీమిలిలోని నరసింహస్వామి కొండ ప్రాంతాల్లో డ్రోన్‌ల సాయంతో ఆదివారం విత్తనాలు చల్లారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు ముమ్మిడిశెట్టి ఆదిత్య, గుల్లల వెంకటేష్ మాట్లాడుతూ ఇప్పటికే పలుమార్లు వివిధ రకాల విత్తనాలను, విత్తన బంతులను కొండపై చల్లినట్లు తెలిపారు. వాటిలో చాలావరకు పెరిగి పెద్దవయ్యాయని, మరింత పచ్చదనం పెంచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. ఇందులో భాగంగా సుమారు మూడు కోట్ల విత్తన బంతులు, మూడు వందల కిలోల విత్తనాలను డ్రోన్‌ల సాయంతో కొండ చుట్టూ చల్లినట్లు వివరించారు. వీలైనంత ఎక్కువ మొక్కలను పెంచాలన్నదే తమ సంస్థ లక్ష్యమని, దీని వల్ల పర్యావరణం మెరుగుపడటంతో పాటు, వర్షాలు కూడా అధికంగా కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి పలువురు సహకరించారని, భవిష్యత్తులో మరింత ఎక్కువ విత్తనాలను చల్లే కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆఫ్ భీమిలి (ఫ్యాబ్) అధ్యక్షుడు కాళ్ల సన్ని, హిందూ ధర్మ పరిరక్షణ సమితి కన్వీనర్ మైలపల్లి షణ్ముఖరావు, సభ్యులు పాల్గొని తమ సహాయ సహకారాలు అందించారు.