
సుగాలి ప్రీతి కేసుపై హైలెవల్ కమిటీ వేయాలి
సాక్షి, విశాఖపట్నం: సుగాలి ప్రీతి కేసుకు సంబంధించి హైలెవల్ కమిటీని ఏర్పాటు చేసి, అందులో సీబీఐని భాగస్వామ్యం చేయాలని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ కుంభా రవిబాబు డిమాండ్ చేశారు. మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షురాలు కె.భాగ్యలక్ష్మి, జీసీసీ మాజీ చైర్‌పర్సన్ స్వాతిరాణితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ‘2017లో టీడీపీ ప్రభుత్వ హయాంలో గిరిజన బాలిక సుగాలి ప్రీతి హత్య జరిగింది. అప్పటి ప్రభుత్వం ఈ కేసును మసిపూసి మారేడుకాయ చేసింది. ప్రీతిని అత్యంత పాశవికంగా హత్య చేసినా, నిందితులను చంద్రబాబు ప్రభుత్వం అప్పుడు, ఇప్పుడు కాపాడుతోంది. ఇప్పుడు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా ఇదే చేస్తున్నారు. ఎన్నికలకు ముందు ఈ కేసు గురించి ఊగిపోయి మాట్లాడిన పవన్, అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడం లేదు. సుగాలి ప్రీతి తల్లి కూడా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తమను ఆదుకున్నారని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యాయం జరగడం లేదని మీడియా సాక్షిగా వాపోయారు. ఆదివాసీలంటే చంద్రబాబుకు ఎప్పుడూ చిన్నచూపే..’ అని రవిబాబు అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఈ కేసును వాడుకున్నారని ఆరోపించిన రవిబాబు.. సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం జరగకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. సుగాలి ప్రీతి కోసం ఎక్కడ పోరాటం జరిగినా.. వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందన్నారు. సమావేశంలో రాష్ట్ర ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ నాయక్, నంద్యాల ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి నాగసారి సుంకన్న, అల్లూరి జిల్లా సోషల్ మీడియా విభాగం అధ్యక్షుడు డాక్టర్ టి.సురేష్‌కుమార్, ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి దండు మధు తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ డిమాండ్