
సుగాలి ప్రీతికి న్యాయం జరగాల్సిందే..
అల్లిపురం/ఎంవీపీకాలనీ: గిరిజన బాలిక సుగాలి ప్రీతి హత్య కేసు విచారణలో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందని దళిత, ఆదివాసీ సంఘాల నాయకులు మండిపడ్డారు. ఆమెను దారుణంగా హత్య చేసి ఎనిమిదేళ్లు గడిచినా నిందితులను పట్టుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని ఆరోపించారు. అల్లిపురంలో న్యూ హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన ‘జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి’రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జైభీమ్ భారత్ వ్యవస్థాపకుడు జడ శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ నిందితులను తప్పించడానికే అభియోగ పత్రంలో అత్యాచారం, హత్య సెక్షన్లను తొలగించారని ఆరోపించారు. నిందితులకు శిక్ష పడితేనే అసలైన న్యాయం జరుగుతుందన్నారు. న్యూ హోప్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు డాక్టర్ మంచా నాగ మల్లేశ్వరి మాట్లాడుతూ గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే ఈ దారుణం జరిగిందన్నారు. ఇప్పు డు కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోనే ఉందని, రాజకీయ ఒత్తిడితోనే ఈ కేసును నీరుగారుస్తున్నారని విమర్శించారు. న్యాయవాది సలీం మాట్లాడుతూ దళిత, ఆదివాసీలకు అన్నివిధాలా అండగా నిలుస్తామన్నారు. సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేసేందుకు ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. గవర్నర్, రాష్ట్రపతిని కలిసి వినతిపత్రాలు సమర్పించాలని తీర్మానించారు. సమావేశంలో జై భీమ్ భారత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్, ఆదివాసీ చైతన్య వేదిక అధ్యక్షుడు ఎస్.చొక్కారావు, పలు సంఘాల ప్రతినిధులు ఉమామహేశ్వరరావు, అప్పన్న, భవానీశంకర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఎంపీ కాలనీలోని గిరిజన భవన్‌లో జరిగిన సమావేశంలో జడ శ్రావణ్‌కుమార్ మాట్లాడారు. సుగాలి ప్రీతి హత్య కేసు విచారణలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం దారుణమన్నారు.
దళిత, ఆదివాసీ సంఘాల నాయకులు