
ఉత్కంఠ పోరులో హర్యానా గెలుపు
విశాఖ స్పోర్ట్స్: నగరంలోని పోర్టు స్టేడియంలో జరుగుతున్న ప్రో కబడ్డీ లీగ్ 12వ సీజన్ స్థానిక క్రీడాభిమానులకు ఉత్కంఠతో పాటు ఉత్సాహం నింపుతోంది. బుధవారం జరిగిన మ్యాచ్‌లు అసలైన కబడ్డీ మజాను పంచాయి. ఒక మ్యాచ్‌లో పునేరి పల్టన్ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించగా.. మరో మ్యాచ్‌లో హర్యానా స్టీలర్స్ ఊపిరి బిగపట్టి చూసేలా అద్భుత విజయాన్ని అందుకుంది. తొలి మ్యాచ్‌లో పునేరి పల్టన్ జట్టు వరసగా మూడో విజయాన్ని నమోదు చేస్తూ తమ జైత్రయాత్రను కొనసాగించింది. బెంగాల్ వారియర్స్‌తో జరిగిన ఈ పోరులో పల్టన్ 45–36 పాయింట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. జట్టు కెప్టెన్ అస్లాం, ఆదిత్య చెరో 11 పాయింట్లతో రైడింగ్‌లో అద్భుత ప్రతిభ కనబరిచారు. మరోవైపు బెంగాల్ వారియర్స్ కెప్టెన్ దేవాంక్ ఒంటరి పోరాటం చేసి 17 పాయింట్లు సాధించినా, జట్టును గెలిపించలేకపోయాడు. రెండో మ్యాచ్ క్రీడాభిమానులకు అసలైన థ్రిల్లర్‌ను పరిచయం చేసింది. డిఫెండింగ్ చాంపియన్ హర్యానా స్టీలర్స్.. యూ ముంబాతో తలపడిన ఈ మ్యాచ్‌లో చివరి క్షణం వరకు విజయం దోబూచులాడింది. నిర్ణీత సమయం ముగిసేసరికి ఇరుజట్లు 36–36తో సమంగా నిలిచాయి. దీంతో విజేతను తేల్చేందుకు టైబ్రేకర్ అనివార్యమైంది. టైబ్రేకర్‌లో రైడర్ శివమ్ పటారే ఒకే రైడ్‌లో మూడు పాయింట్లు సాధించి హర్యానాను గెలుపు తీరాలకు చేర్చాడు. ఈ ఉత్కంఠభరిత విజయం స్టీలర్స్‌కు ఈ సీజన్‌లో తొలి గెలుపును అందించింది. అజిత్ కుమార్ 12 పాయింట్లతో యూ ముంబా తరఫున పోరాడినా ఫలితం లేకపోయింది. గురువారం జైపూర్ పింక్ పాంథర్స్, తెలుగు టైటాన్స్, పునేరి పల్టన్, దబాంగ్ ఢిల్లీ జట్ల మధ్య మ్యాచ్‌లు జరగనున్నాయి.
కొనసాగిన
పునేరి జోరు