
సీఐపీఈటీతో సింహాద్రి ఎన్టీపీసీ ఒప్పందం
పరవాడ: సింహాద్రి ఎన్టీపీసీ పరిసర ప్రాంతాల యువతకు నైపుణ్యాభివృద్ధిశిక్షణ ద్వారా ఉపాధి, ఆదాయ వనరులను కల్పించేందుకు సింహాద్రి ఎన్టీపీసీ కృషి చేస్తుందని సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ప్రాజెక్టు హెడ్ సమీర్‌శర్మ అన్నారు. యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కల్పించేందుకు వీలుగా విజయవాడలోని సీఐపీఈటీతో ఎన్టీపీసీ సింహాద్రి బుధవారం ఒప్పందం కుదుర్చుకుంది. అనంతరం సంస్థ ఈడీ సమీర్‌శర్మ మాట్లాడుతూ నైపుణ్యాభివృద్ధి శిక్షణను యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సంస్థ సీఎస్సార్ విభాగం సౌజన్యంతో పరవాడ ప్రాంతంలోని నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించి తద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుపర్చడానికి వీలుగా సీఐపీఈటీతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఒప్పందం మేరకు 2025–26లో మూడు బ్యాచ్‌లకు వసతులతో కూడిన శిక్షణ కల్పించనున్నారు. బ్యాచ్‌కు 30 మంది చొప్పున శిక్షణ పొందుతారు. మెషిన్ ఆపరేటర్–ఇంజెక్షన్ మోడలింగ్, మెషిన్ ఆపరేటర్–ప్లాస్టిక్ ప్రాసెసింగ్‌లో నాలుగు నెలల పాటు శిక్షణ కల్పిస్తారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.