భూకంపం! | - | Sakshi
Sakshi News home page

భూకంపం!

Aug 5 2025 11:00 AM | Updated on Aug 5 2025 11:00 AM

భూకంప

భూకంపం!

కూటమి నేతల్లో
సొంత పార్టీ నేతలే విమర్శనాస్త్రాలు
ఎండాడ భూమిపై ఇప్పటికే విచారణ కోరిన గంటా రెవెన్యూ మంత్రికి లేఖ రాసిన స్పీకరు అయ్యన్నపాత్రుడు అదే పనిగా ప్రశ్నలు సంధిస్తున్న జనసేన కార్పొరేటర్‌ కనీసం స్పందించని ప్రభుత్వం చినబాబు హస్తం ఉండటమే కారణమని గుసగుసలు

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:

కూటమి పార్టీల మధ్య మాటల ‘భూ’కంపం మొదలైంది. ఎండాడలోని 5 ఎకరాల విషయంలో విచారణ జరగాల్సిందేనని మొన్నటికి మొన్న గంటా శ్రీనివాసరావు లేఖ రాయగా.. తాజాగా ఏకంగా స్పీకరు అయ్యన్నపాత్రుడు లేఖాస్త్రం సంధించారు. మరోవైపు అన్ని వ్యవహారాల్లోనూ తానుండాల్సిందేనని రీతిలో తలదూర్చే జనసేన కార్పొరేటర్‌ కూడా ఈ వ్యవహారంలో విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ఎండాడలోని 5.10 ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగించి.. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి అప్పగించేలా కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వెనువెంటనే ఆ భూమి అభివృద్ధి పేరిట రిజిస్ట్రేషన్లు కూడా జరిగిపోయాయి. మరోవైపు సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు ఎదురవుతున్నప్పటికీ ఈ వ్యవహారంపై ఇప్పటివరకు అధికారికంగా ఏ ఒక్కరూ స్పందించకపోవడం గమనార్హం. ఈ భూ వ్యవహారంలో ‘దక్షిణ’ నేతతో పాటు చినబాబు పాత్ర ఉండటంతో విచారణ జరగడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

సొంత పార్టీ నేతలే..!

సాధారణంగా ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు రావడం సహజం. ఎండాడ భూమి విషయంలో మాత్రం విచిత్రంగా కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన నేత వైఎస్సార్‌సీపీ నేతలపై విమర్శలు సంధిస్తున్నారు. నిజంగా ఈ వ్యవహారంలో వైఎస్సార్‌ సీపీ నేతలు ఉంటే విచారణ జరిపేందుకు ఎందుకు ముందుకు వెళ్లడం లేదన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అంతేకాకుండా ఈ వ్యవహారంలో స్థానిక ఎమ్మెల్యే పాత్ర ఉందంటూ కేవలం విమర్శలు రావడంతోనే నేరుగా కలెక్టరుకు గంటా శ్రీనివాసరావు లేఖ రాశారు. ఈ లేఖ రాసి సుమారు నెల రోజులు కావస్తోంది. మరోవైపు ఇందులో తన పాత్ర లేదని, విచారణ జరపాలంటూ స్పీకరు అయ్యన్నపాత్రుడు తాజాగా నేరుగా రెవెన్యూ మంత్రికే లేఖ సంధించారు. దీనిపై ప్రభుత్వం నుంచి కనీస స్పందన రావడం లేదు. విచిత్రంగా ఇందులో ప్రతిపక్ష పార్టీ పాత్ర ఉందంటూ పసలేని ఆరోపణలు గుప్పిస్తున్నారు. మొత్తం వ్యవహారాన్ని నడిపింది తమ వారేనని.. ప్రధాన పాత్ర అంతా చిన్నబాబుదేనని తెలిసినప్పటికీ వైఎస్సార్‌ సీపీ మీద ఎక్కుపెట్టి.. పరోక్షంగా చిన్నబాబునే లక్ష్యంగా చేసుకున్నారనే వాదన కూడా ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతుతుంది. అయితే, ఈ విషయంలో నిజంగా విచారణ జరిపితే.. రికార్డుల ట్యాంపరింగ్‌తో పాటు వ్యవహారం నడిపి నగదు, ఎకరన్నర పొలాన్ని కొట్టేసిన దక్షిణ నియోజకవర్గ నేతతో పాటు చిన్నబాబు పాత్ర కూడా బయటకు వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇదీ భూ దందా నేపథ్యం..!

ఎండాడలోని సర్వే నెంబరు 14–1లోని 5.10 ఎకరాల భూమికి చెందిన రికార్డుల్లో రెవెన్యూ అధికారులనూ తికమకపెట్టే వ్యవహారాలు తెరవెనుక నడిచాయి. రికార్డుల్లో ఒక పేరు.. ఆదేశాల్లో మరో పేరు.. అంతిమంగా ప్రభుత్వ భూమిని కాస్తా ప్రైవేటుపరం చేస్తూ నిర్ణయాలు వెలువడ్డాయి. 14–1 సర్వే నెంబరులోని భూమి చెట్టిపల్లి సీతారామయ్య పేరు మీద నమోదై ఉంది. అయితే, విచిత్రంగా తాజాగా కలెక్టర్‌ జారీచేసిన ఉత్తర్వుల్లో మాత్రం ఈ భూమి మాజీ సైనిక అధికారికి చెందినదని.. చెట్టిపల్లి సీతారామయ్య పేరు కేవలం ఫారం–3లో మాత్రమే ఉందని పేర్కొన్నారు. ఇందుకు భిన్నంగా అసలు వ్యక్తి సాగులోనే లేరంటూ వై.బాలిరెడ్డికి చెందినదంటూ ఆయన పేరు మీద బదలాయించాలంటూ ఆదేశాల్లో పేర్కొన్నారు. వాస్తవానికి ఈ భూమికి సంబంధించిన ఫైలు గత కొద్దికాలంగా కలెక్టరేట్‌లో చక్కర్లు కొట్టినట్టు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగా కింది స్థాయి నుంచి రికార్డులను సృష్టించారనే విమర్శలున్నాయి. అడంగల్‌తో పాటు గతంలో స్వయంగా కలెక్టర్‌ సంతకంతో ఎండాడలోని సర్వే నెంబరు 14–1కు చెందిన 5.10 ఎకరాల భూమి పట్టాదారు చెట్టిపల్లి సీతారామయ్య పేరు మీద ఉందని.. ఇది ప్రభుత్వ భూమి కావడంతో రిజిస్ట్రేషన్‌ చేయవద్దని పేర్కొంటూ జిల్లా రిజిస్ట్రార్‌కు పంపారు. ఇక అడంగల్‌ కూడా ఈయన పేరు మీదనే ఉంది. అయినప్పటికీ సీతారామయ్య పేరు కేవలం ఫారం–3లో మాత్రమే ఉందని, దీనిని తొలగించాలని కూడా కలెక్టర్‌ తాజాగా జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో పై నుంచి ఆదేశాలు వచ్చేందుకు కీలకంగా వ్యవహరించిన విశాఖ దక్షిణ నియోజకవర్గానికి చెందిన నేత ‘సీతయ్య’ లెవెల్‌లో చక్రం తిప్పినట్టు సమాచారం. ఇందుకోసం ఆయన భారీగా నగదుతో పాటు ఎకరన్నర పొలం కూడా లబ్ధిపొందినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఇంకా ఏమైనా ఫైల్స్‌ ఉంటే తన దృష్టికి తీసుకువస్తే వ్యవహారం నడిపిద్దామంటూ డీల్స్‌కు దిగుతున్నట్టు కూడా సమాచారం.

భూకంపం!1
1/1

భూకంపం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement